మంచిర్యాల టౌన్, మే 25 : సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీర్ ఇకలేరు. నాలుగు దశాబ్దాలకు పైగా పాత్రికేయునిగా పనిచేసిన ఆయన ఈ ప్రాంత ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓమెగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆదివారం ఉదయం ఆయన మృతదేహాన్ని మంచిర్యాలలోని తన నివాసానికి తీసుకువచ్చారు. సాయంత్రం ఐదుగంటలకు మందమర్రికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ‘బండకింది బతుకులు’ అనే శీర్షికతో రెండున్నరేళ్ల పాటు సింగరేణి కార్మికుల వెతలపై రాసిన కథనాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. జర్నలిస్టు మునీరన్నగా ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితుడైన ఆయన ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. అనంతరం పలు పత్రికల్లో వ్యాసాలు రాశారు.
టీయూడబ్ల్యూజే-143 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మంచిర్యాల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా పనిచేశారు. సింగరేణి కార్మికునిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు. సింగరేణి జేఏసీ చైర్మన్‌గా ఈ ప్రాంత కార్మికులను తెలంగాణ ఉద్యమంలో మమేకం చేసి ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లడంలో ఆయన తనవంతు పాత్ర పోషించారు. మునీర్ మరణ వార్త తెలుసుకున్న రాజకీయనాయకులు, సింగరేణి కార్మిక సం ఘాల నాయకులు, పాత్రికేయులు, అభిమానులు పెద్ద సంఖ్యలో మంచిర్యాలలోని ఆయన నివాసానికి తరలివచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, కార్మిక సంఘాల నాయకులు జనక్‌ప్రసాద్, రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, రియాజ్ అహ్మద్, సీపీఐ, విప్లవ సంఘాల నాయకులు, పాత్రికేయులు మునీర్‌కు నివాళులర్పించారు. మందమర్రిలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఎమ్మెల్సీ కోదండరామ్, టీబీజీకేఎస్ నాయకులు కెంగర్ల మల్లయ్య, సీపీఐ నాయకులు కలవేణ శంకర్ పాల్గొన్నారు.
మునీర్ అంత్యక్రియల్లో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పాల్గొని పాడే మోశారు. ఆయన మాట్లాడుతూ తమ కుటుంబంతో మునీర్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన తాత కాక వెంకటస్వామితో మునీర్ అత్యంత సన్నిహిత సంబంధం ఉండేదని, పెదనాన్న గడ్డం వినోద్, తన తండ్రి గడ్డం వివేక్లతో కూడా ఆయన ఎంతో దగ్గరగా ఉండే వారని తెలిపారు. ఆయన మరణం తనని ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మునీర్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.