చింతలమానేపల్లి, ఫిబ్రవరి 10 : ఉన్నది ఎకరన్నర భూమి. అదే ఆ కుటుంబానికి ఆధారం. తెలిసింది వ్యవసాయం. ఒక్క వరి వేస్తే ఇల్లు గడువదు. అందుకే ఇతర పంటల వైపు దృష్టి పెట్టాడు బిమల్ బిశ్వాస్. కుమ్రం భీం జిల్లాలోని చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్ -2 గ్రామానికి చెందిన ఈయన ఎకరం భూమిలో సీజనల్ కూరగాయల పంటలు వేస్తూ, మిగతా అర ఎకరంలో ఇంటి అవసరాలకు వరి వేసుకుంటున్నాడు. సీజన్‌కు అనుగుణంగా కూరగాయల పంటలు వేస్తున్నాడు. 8 రకాలకు పైగా కూరగాయలు పండిస్తున్నాడు. తన పొలంలో వ్యవసాయ బావి ద్వారా వీటికి నీళ్లందిస్తున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరంట్ తన పంటలను కాపాడుతున్నదని చెబుతున్నాడు. పెట్టుబడికి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వమే డబ్బులు వేస్తున్నదని, వీటిని సద్వినియోగం చేసుకొని పంటలు వేస్తున్నట్లు తెలిపాడు. కూరగాయల విత్తనాలను ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, నజ్రూల్‌నగర్ నుంచి తీసుకొస్తున్నాడు. చేతికి వచ్చిన పంటను దగ్గర్లోని కౌటాల, రవీంద్రనగర్, బెజ్జూర్, సలుగుపల్లిలో నిర్వహించే వారసంతల్లో నేరుగా విక్రయిస్తున్నాడు. ఏడాదికి సుమారు రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. కూరగాయల పంట ద్వారా వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు కాగా, పెద్ద కూతురికి వివాహం జరిపించాడు. కొడుకు బీటెక్ చదవుతుండగా, మరో కూతురు పదో తరగతి చదువుతున్నది.
వంకాయ, మిరప, బీట్రూట్, క్యారెట్, కాకర, సోరకాయ, బీరకాయ, పూతగోబి, గడ్డగోబి, పత్తగోబితో పాటు సీజనల్‌కు సంబంధించి బెండకాయ, టమాటో మిరపకాయ, చిక్కుడు, అనుములు వేస్తున్నాడు.
నాకున్న ఎకరం భూమిలో ఆరుతడి పంటలు వేస్తున్న. మొత్తం భూమిలో వరి వేయకుండా ఎకరం భూమిలో కూరగాయలు మాత్రమే వేసిన. దీని ద్వారా వచ్చిన ఆదాయంతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్న. పంటల దిగుబడి మంచిగ వస్తున్నదంటే సర్కారు ఇస్తున్న 24గంటల కరంట్, రైతు బంధే కారణం. పెట్టుబడి పైసలు కూరగాయల సాగుకు ఉపయోపగడుతున్నయ్. పండించిన కూరగాయలను నేరుగా వారసంతల్లోకి వెళ్లి విక్రయిస్తున్న. ఏడాదికి రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు సంపాదిస్తున్న.
– బిమల్ బిశ్వాస్, బెంగాళీ రైతు, రవీంద్రనగర్-2 (సెల్ నంబర్ 9912398859)