వేసవి సెలవులకు టాటా చెప్పి.. బడిబాట పట్టనున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. దాదాపు 50 రోజులకుపైగా ఆటాపాటలతో గడిపిన విద్యార్థులు.. నేడు(సోమవారం) పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బడులకు రానున్నారు. ఈ క్రమంలో ఆదివారం పాఠశాలలను ‘నమస్తే’ బృందం విజిట్ చేసింది. పలు సమస్యలు దృష్టికి వచ్చాయి. పైకప్పు పెచ్చులూడి, తలుపులు లేకుండా, నిర్మాణాలు పూర్తికాకుండా శిథిలావస్థలో ఉన్న తరగతి గదులు.. అధ్వానంగా ఉన్న వంటశాలలు, నీటి సౌకర్యం లేకుండా కంపు కొట్టే విధంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు.. ప్రహరీ లేకపోవడంతో పశువులు, పందులకు ఆవాసంగా మారిన బడులు కనిపించాయి.
మంచిర్యాల టౌన్, జూన్ 14 : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 709 ప్రభుత్వ పాఠశాలల్లో 43,072 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2,464 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ‘జయశంకర్ బడిబాట’ కార్యక్రమం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులకు సెన్సెస్ విధులు అప్పగించడం మూలంగా ఆశించిన స్థాయిలో చేరలేదనే వాదనలున్నాయి. పాఠశాల ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు అందించాలని విద్యాశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాకు 3,05,620 పాఠ్యపుస్తకాలు పార్ట్-1కు అవసరమవగా, 2,86,340 వచ్చాయి. వీటిలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బుక్‌డిపో నుంచి 2,70,144 పుస్తకాలను 18 మండలాలకు చేరవేశారు. ఈ సారి కొత్తరంగులో యూనిఫాం అందించనున్నారు. అందుకు సంబంధించిన వస్త్రం ఇప్పటికీ జిల్లాకు రాలేదు. దీంతో విద్యార్థులు పాత యూనిఫాంలతోనే రానున్నారు.
కోటపల్లి : పాఠశాలకు వెళ్లే దారిలో నీటి మడుగు

కోటపల్లి, జూన్ 14 : కోటపల్లి మండలం పారుపల్లి ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలకు దారి కరువయ్యింది. సమీపంలోని బోరుబావి నుంచి వృథాగాపోతున్న నీటితో పాటు, మురుగు నీరు పాఠశాల ప్రధాన రహదారిపైకి వచ్చి చేరుతున్నది. విద్యార్థులు, ప్రజలు అటుగా వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్నారు.
గుడిసెలు, రేకుల షెడ్లలోనే చదువులు..

కాసిపేట, జూన్ 14 : కాసిపేట మండలంలోని పాత తిరుమలాపూర్లో ప్రైమ రీ పాఠశాలకు భవనం లేక గుంజలు పాతి, పైన రేకులు కట్టి ఉంచారు. అందులోనే పాఠశాల కొనసాగుతున్నది. వర్షం పడితే ఎక్కడికక్కడ ఊడిపోయే పరిస్థితి. కాలం ఏదైనా ఇదే రేకుల కింద చదువు లు వెళ్లదీస్తున్నారు. కొలాంగూడలోనూ ఇదే పరిస్థితి. గ్రామం మధ్యలో గుంజ లు, గూన పెంకులు, వెదురుతో వేసిన గుడిసె కిందనే చదువుకునే పరిస్థితి.
సమస్యలు ఎకడికకడే!
తాండూర్, జూన్ 14 : తాండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లకు రెండు రోజుల క్రితమే ఇన్చార్జి డీఈవో పూజలు చేసి పనులు ప్రారంభించారు. కత్తెర్ల ప్రాథమిక పాఠశాలలో నూతన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, వంటశాలలకు ఇటీవలే పనులు ప్రారంభించారు.
తప్పని తిప్పలు..

మందమర్రి, జూన్ 14 : మందమర్రి పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాలకు ‘మన బస్తీ-మన బడి’ కింద 2023లో రూ.77.86, సీఎస్ఆర్ కింద మరో రూ.50 లక్షలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. అదనపు గదుల నిర్మాణంతో పాటు, అధునాతన హ్యాండ్ వాష్ ఏరియా, డైనింగ్ హాల్, మూత్రశాలల నిర్మాణాలను చేపట్టారు. అయితే ఇప్పటి వరకు డైనింగ్ హాల్ పునాదుల దశలోనే ఉండగా, అదనపు గదుల్లో రెండు స్లాబు వరకు పూర్తయ్యాయి.
తరగతి గదుల పరిస్థితి..

మందమర్రి రూరల్, జూన్14 : మందమర్రి మండలం పొన్నారం జడ్పీ ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్ హయాంలో ‘మన ఊరు-మన బడి’ కింద రూ.70 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వం మారడంతో నిలిచిపోయాయి. అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్, పాఠశాల విద్యుదీకరణ, మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మాణం పక్కనబెట్టారు.
అరకొర వసతులు..
చెన్నూర్, జూన్ 14 : చెన్నూర్ పట్టణంలోని బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కింద రెండేళ్ల క్రితం అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికీ పూర్తికాకపోగా అసంపూర్తిగా ఉన్నది. దాదాపు 260 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సరిపడా గదులు లేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రభుత్వ దవాఖాన పక్కన పాఠశాలలో గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షానికి ఊరుస్తుండడంతో విద్యార్థులు కూర్చోలేని పరిస్థితి నెలకొన్నది.
శిథిలావస్థలో పాఠశాలలు..
కాగజ్‌నగర్, జూన్ 14 : కాగజ్‌నగర్ పట్టణంలోని బీఎంఎస్ కార్యాలయ సమీపంలోని బాలికల ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఓల్డ్ హైస్కూల్లో పాఠశాల కోసం నూతన భవనం నిర్మించినప్పటికీ మరుగుదొడ్లు, నీటి సౌకర్యం కల్పించకపోవడంతోనే ఎస్పీఎం క్వార్టర్లో పాఠశాల కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. మండలంలోని లైన్‌గూడ జీపీ పరిధి మారేపల్లిలోని ప్రాథమిక పాఠశాల సైతం శిథిలావస్థలోనే కొనసాగుతున్నది.
అసంపూర్తి పనులు..
కన్నెపల్లి, జూన్ 14 : కన్నెపల్లి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండేళ్ల క్రితం ‘మన ఊరు-మన బడి’ కింద పనులు చేపట్టారు. 60 శాతం పనులే చేశారు. తరగతి గదుల ఆధునీకరణ, వాటార్ ట్యాంక్, డైనింగ్ హాలు పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
నెన్నెల, జూన్ 14 : నెన్నెల జడ్పీ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగానే ఉన్నది. హ్యాండ్‌వాష్ పంపుల వద్ద, అదనపు గదుల్లో చెత్త నిండిపోయి కనిపిస్తున్నది. మండలంలోని దాదాపు అన్ని పాఠశాలల్లో పరిస్థితి ఇలాగే కొనసాగుతున్నది.
దహెగాం, జూన్ 14 : దహెగాం మండలం అయినం ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి వరకు తరగతులు ఉండగా, మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో పెద్దవాగు బ్యాక్ వాటర్‌తో ప్రహరీ కూలిపోయింది. అయినా అధికారులు పట్టించుకోవడంలేదు.