ఆదిలాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉట్నూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా విద్యను అందిస్తున్నది. కరోనా కారణంగా విద్యార్థుల చదువులకు రెండేళ్లపాటు ఆటంకం కలుగగా.. అధికారులు ఈ నష్టాన్ని పూడ్చడానికి చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో 3 నుంచి 9వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి అధికారులు అక్షరజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టారు. గత నెల 9న ప్రారంభమైన కార్యక్రమం(పాఠశాలల పనిదినాలు) మార్చి 30, 2023 వరకు వంద రోజులపాటు కొనసాగనుంది.
ఉట్నూరు ఐటీడీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1,052 పాఠశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 54 ఆశ్రమోన్నత, 489 ప్రాథమిక, 12 శాటిలైట్ కేంద్రాలు ఉన్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 45 ఆశ్రమోన్నత, 320 ప్రాథమిక, ఏడు శాటిలైట్ కేంద్రాలు.. నిర్మల్ జిల్లాలో 17 ఆశ్రమోన్నత, 42 ప్రాథమిక, ఒక శాటిలైట్.. మంచిర్యాల జిల్లాలో 16 ఆశ్రమోన్నత, 51 ప్రాథమిక, 2 శాటిలైట్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 32 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో అక్షరజ్యోతి కార్యక్రమాన్ని రెండు విభాగాలుగా అమలు పరుస్తారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో.. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెకండరీ స్థాయిలో బోధన నిర్వహిస్తారు. ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం అభ్యాస దీపిక, ప్రత్యేక వర్క్‌బుక్‌లు తయారు చేశారు. తెలు గు, ఇంగ్లిష్, గణితం ఉంటాయి. ఈ పుస్తకాలను గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పంపిణీ చేశారు. సెకండరీ స్థాయి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులకు సంబంధించిన సాధన పుస్తకాలను అందజేశారు.
ఉపాధ్యాయులకు కరదీపికలు 3 నుంచి 5వ తరగతి ప్రాథమిక విద్యార్థులకు అభ్యాస దీపికలు.. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సాధన పుస్తకాలు పంపిణీ చేశారు. 100 రోజుల అక్షరజ్యోతి కార్యక్రమం తర్వాత ప్రతి విద్యార్థి కనీస సామర్థ్యాలు సాధించేలా ప్రణాళికలు తయారు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాలు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఐటీడీఏ విద్యా విభాగంలో పనిచేస్తున్న డివిజన్ స్థాయి అధికారులు, తరగతుల నిర్వహణ, పరీక్షలు ఎలా నిర్వహించాలనే విషయంలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా ఏ విషయంలోనైనా సందేహాలు, వాటిని నివృత్తి చేయడానికి ఐటీడీఏ కార్యాలయంలో సబ్జెక్టు ఆన్లైన్ రిసోర్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్షరజ్యోతి కార్యక్రమం ప్రారంభానికి ముందుగా విద్యార్థుల స్థాయిని నిర్ధారించడానికి బేస్‌లైన్ టెస్ట్ నిర్వహించారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి పది రోజులకు ఒకసారి లఘు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 50 రోజులకు మిడ్లైన్ టెస్ట్, వంద రోజుల తర్వాత ఎండ్‌లైన్ టెస్ట్‌లు ఉంటాయి.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఐటీడీఏ అధికారులు పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. పాఠశాల, డివిజన్, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. వీరికి ప్రాథమిక స్థాయిలో తరగతులను పర్యవేక్షించడానికి ఐటీడీఏ ఎస్ఈఆర్పీలు సహకారం అందిస్తారు. పర్యవేక్షణకు సంబంధించి రోజూ నివేదికలు అధికారులకు పంపిస్తారు. వీటి ఆధారంగా అధికారులు చర్యలు తీసుకుంటారు.
గిరిజన విద్యార్థుల్లో కనీస అభ్యాస సామర్థ్యాలను పెంపొందించడానికి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అలోచన మేరకు అక్షరజ్యోతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. వంద రోజుల ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థి అభ్యాస సామర్థ్యాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించాం. బోధన విషయంలో ఉపాధ్యాయలకు శిక్షణ ఇచ్చాం. ప్రత్యేక ఆధికారులు ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. విద్యార్థులకు పది రోజులకోసారి పరీక్షలు నిర్వహిస్తున్నాం.
– జగన్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి, ఐటీడీఏ, ఉట్నూర్