కాసిపేట : ఉన్నత చదువులకు పాఠశాల విద్య పునాదిలాంటిదని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ( Collector Kumar Deepak ) అన్నారు. శుక్రవారం కాసిపేట మండలం పెద్దనపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి బాలల దినోత్సవంలో ( Childrens Day ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్య తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి శాంతి కపోతాలు ఎగురవేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలలో విద్యార్థులకు ఏకాగ్రత, క్రమశిక్షణ అలవాటు చేయాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరీ గోడలు , మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వివరించారు. బోరు, ప్రహరీ గోడ నిర్మాణం, త్రాగునీటి వసతిని కల్పించిన పాఠశాల పూర్వ విద్యార్థి గుర్రం రాజేష్ గౌడ్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో ముక్తవరం వెంకటేశ్వర స్వామి, మాజీ కౌన్సిలర్ కొక్కెర చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.