దండేపల్లి, ఫిబ్రవరి 9 : మండలంలోని గూడెం గుట్టపై ఆదివారం రాత్రి సత్యదేవుని కల్యాణం వైభవంగా జరిగింది. గోధూళిక సుముహూర్తమున సత్యనారాయణస్వామి-రమాదేవిల కల్యాణాన్ని వేదపండితులు ఆశేష భక్తజనం మధ్య ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా నుంచేగాక కరీంనగర్, జగిత్యాల, ఇతర జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు హాజరయ్యారు. ఈవో సంకటాల శ్రీనివాస్, అర్చకులు టీటీడీ నుంచి వచ్చిన పట్టు వస్ర్తాలను స్వామివారికి సమర్పించారు.
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీజేపీ నాయకులు రఘునాథ్‌రావు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మార్కెట్ కమిటీ చైర్మ న్ దాసరి ప్రేంచంద్, ఆలయ ప్రధాన అర్చకుడు గోవర్ధన రఘుస్వామి, అర్చకులు సంపత్‌స్వామి, గోపాల స్వామి, సురేష్ స్వామి, వేదపండితులు నారాయణశర్మ పాల్గొన్నారు.
Adilabad