దండేపల్లి, నవంబర్ 27 : ఆ ఊరి పేరు గూడెం.. దీనిని గిరిజన గ్రామం అనుకుంటే పొరబడ్డట్లే.. పేరును బట్టి అప్పటి ప్రభుత్వం ఎస్టీకి కేటాయించింది. కానీ ఇక్కడ ఒక్క గిరిజనుడు కూడా లేకపోవడం గమనార్హం. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా దీనిని ఎస్టీకి కేటాయించడం పరిపాటిగా మారింది. గత 38 ఏళ్లుగా ఇక్కడ ఎన్నికలు జరుగడం లేదంటే ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
1987 నుంచి నిలిచిన ఎన్నికలు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో 31 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులోని గూడెం గ్రామ పంచాయతీలో 3468 జనాభా ఉండగా, 2140 మంది ఓటర్లు ఉన్నారు. 10 వార్డులు ఉన్నాయి. ఇందులో 5 జనరల్, 5 ఎస్టీలకు రిజర్వ్ చేశారు. సర్పంచ్ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఎవరు ఏ ప్రాతిపాదికన జనాభా లెక్కించారో తెలియదు కానీ.. ఇక్కడ ఒక్క గిరిజనుడు లేకపోయినా ప్రభుత్వం ఏజెన్సీ గ్రామంగా గుర్తించింది. 1987 నుంచి ఎస్టీకి కేటాయిస్తూ వస్తున్నారు. కానీ అప్పటి నుంచి ఎన్నికలు జరగడం లేదు. సర్పంచ్ పదవిని ఎస్టీలకు రిజర్వు చేయడంతో అనేకసార్లు గ్రామస్తులు ఆందోళనలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.
బోసిపోతున్న నామినేషన్ కేంద్రం..
గూడెం జీపీలో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారితోపాటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఇతర అధికారులు నామినేషన్ కేంద్రంలో నామినేషన్ల కోసం వేచి చూస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థి దొరకకపోవడంతో ఇతర జనరల్ వార్డు స్థానాలకు కూడా పోటీ చేయడానికి అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో నామినేషన్ కేంద్రం బోసిపోతున్నది.