కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల మధ్య సయోధ్య కుదిర్చి పంచాయతీలను ఏకగ్రీవం చేయడం రాజకీయ పార్టీల పెద్దలకు కష్టంగా మారుతున్నది. 2019లో జరిగిన మొదటి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 18 గ్రామాలు ఏకగ్రీవం కాగా, ప్రస్తుతం కేవలం 4 పంచాయతీలు మాత్రమే కావడం చర్చనీయాంశమవుతున్నది. నామినేషన్ల విత్‌డ్రా చేసుకోవాలని చేసే బుజ్జగింపులకు లొంగని అభ్యర్థులు బరిలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి విడుతలో ఎన్నికలు జరుగున్న జైనూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్-యూ, వాంకిడి మండలాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య సయోధ్య కుదర లేదు. ఆయా మండలాల్లో 114 గ్రామ పంచాయతీలు, 944 వార్డులకు మొదటి విడుత ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 114 గ్రామ పంచాయితీలకు 522 నామినేషన్లు, 944 వార్డులకు 1424 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 114 గ్రామ పంచాయతీల్లో కేవలం నాలుగు గ్రామాలు మాత్రమే ఏకగ్రీవం కాగా, మిగతా చోట్ల ఎన్నికలు జరుగనున్నాయి.
ఇక రెండో విడుత ఎన్నికలు జరుగనున్న బెజ్జూర్, చింతలమానేపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్(టీ) మండలాల్లో 113 సర్పంచ్ స్థానాలు, 992 వార్డుల సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 2తో ముగిసింది. 113 గ్రామాల్లో 737 నామినేషన్లు, 992 వార్డుల కోసం 2428 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 6న నామినేషన్ల విత్‌డ్రా ఉన్నది. ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థులెవరో తేలనున్నారు. అభ్యర్థుల మధ్య సయోధ్య కుదిర్చి విత్‌డ్రాలు చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మూడో విడుత ఎన్నికలు జరుగనున్న కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో 108 గ్రామ పంచాయతీలు, 938 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉండేందుకు అభ్యర్థులు మొగ్గుచూపుతున్నారు. ప్రత్యర్థి అభ్యర్థులు చూపించే తాయిలాలకు తలొగ్గని అభ్యర్థులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. బంధువులు, మిత్రులు, తమ వర్గాల వారికి చెందిన ఓట్లు ఎన్ని ఉన్నాయని లెక్కలేసుకుంటున్నారు.