తాండూర్ : మండలంలో ఈ నెల 14న నిర్వహిస్తున్న రెండవ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ( Local Election ) నియమావళి పై సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల సహాయ అధికారి, ఎంపీడీవో శ్రీనివాస్( MPDO Srinivas ) అధ్యక్షతన నిర్వహించిన అవగాహనలో జిల్లా ఎన్నికల వ్యయ పర్యవేక్షణాధికారి రాజేశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఈ నెల 14న నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా కృషి చేయాలన్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్థనా నియమావళిని పాటించాలని సూచించారు.
ఎన్నికల నియమావళిని అతిక్రమించొద్దని తెలిపారు. ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు అందించాలన్నారు. వాహనాలు, మైక్ పర్మిషన్, ఇతర విషయాలపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. మండల ఎన్నికల సహాయ వ్యయపరిశీలకురాలు రశ్మిని, తహసీల్దార్ జ్యోత్స్న, సీఐ దేవయ్య, ఎస్సై కిరణ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.