కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కె) గ్రామంలోని శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం నుంచి సప్తాహ వేడుకలు(Saptaha celebrations) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయం తో పాటు శ్రీ రాజరాజేశ్వరాలయాలను ముస్తాబు చేశారు. ఆలయంలో ఆంజనేయ స్వామికి, శివలింగానికి అభిషేక పుష్పార్చన పూజలు నిర్వహించారు.
ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామి వారి చిత్రపటo వద్ద శ్రీ ఫలాన్ని ఉంచి దైవనామస్మరణతో భజనలు చేస్తూ సప్తమి వేడుకలను ప్రారంభించారు. స్థానిక ఆలయాల వద్ద కాషాయ జెండాలను ఆవిష్కరించారు. ఏడు రోజులపాటు ప్రతిరోజు రాత్రి 9 నుంచి 12 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కీర్తనకారులు భజన పాటలు వినిపిస్తారని నిర్వాహకులు తెలిపారు.
ఉదయం, సాయంత్రం వేళలో హరిపాట్, భజనలు కొనసాగుతాయని వివరించారు. 19న ఆదివారం రాత్రి ఆయా గ్రామాల నుంచి భజన దిండిలతో రాత్రంతా జాగారం, తెల్లవారుజామున కాకడ హారతి, ఉదయం శోభయాత్ర, ఉట్టికొట్టే కార్యక్రమం, ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలతో వేడుకలు ముగుస్తాయని వెల్లడించారు.