నిర్మల్ (నమస్తే తెలంగాణ)/భైంసా, జూలై 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ 9వ విడుతలో భాగంగా ‘గోదారమ్మకు పచ్చలహారం’ కార్యక్రమాన్ని మహారాష్ట్రలోని ధర్మాబాద్ గోదావరి మంజీరా నదుల సంగమం సమీపంలోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద శుక్రవారం మాజీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదారమ్మకు పచ్చలహారంలో భాగంగా బాసర నుంచి నాసిక్ త్రయంబకేశ్వర్ వరకు గోదావరి నది కోతకు గురికాకుండా ఇరువైపులా 99లక్షల వెదురు, తదితర మొక్కలు నాటనున్నట్లు ఆయన తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వాములై మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ముందుగా బాబ్లీ సరిహద్దు వద్దకు చేరుకున్న మాజీ ఆయనకు గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం గోదావరి నది తీరంలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మొక్కలు నాటా రు.
ముఖ్రా(కే) మాజీ సర్పంచ్ మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు డాక్టర్ పడకంటి రమాదేవి, డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, విలాస్ గాదేవార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు ముథోల్ మండల బిద్రెల్లి వద్ద బీఆర్ఎస్ కార్యాలయం వద్ద నాయకులతో కలిసి మొక్కలు నాటారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం చేపట్టి ఊరూరా మొక్కలు నాటించి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.