మంచిర్యాల, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. జైపూర్, చెన్నూర్, మంచిర్యాల గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు రాళ్లవాగు, పాలవాగు, ఎర్రవాగు, బతుకమ్మ వాగులో యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. వర్షాలు ఎక్కువైతే నీటి ప్రవాహం పెరిగే అవకాశముండగా, నిత్యం వందలాది లారీలు, ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ రహస్య ప్రదేశాల్లో కుప్పలు పోస్తున్నారు. పాత మంచిర్యాల, నస్పూర్, జైపూర్ మండలంలో ఎక్కడ చూసినా అక్రమ ఇసుక డంప్‌లు దర్శనమిస్తున్నాయి. జోరుగా అక్రమ దందా చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి కొడుతున్నా, టీఎస్ఎండీసీ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గోదావరి పరివాహ ప్రాంతాల్లో టీఎస్ఎండీసీ(తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివద్ధి సంస్థ) అనుమతులున్న కోటపల్లి మండలం ఎర్రాయిపేట, కొల్లూరు (రెండు) ఇసుక రీచ్‌లతో పాటు వేంపల్లి, ఖర్జీ, చెన్నూర్ బతుకమ్మ వాగులో ఇసుక తవ్వకాలకు అనుమతులున్నాయి. జిల్లా మొత్తంలో ఆరు ఇసుక రీచ్‌లుండగా, ఆయాచోట్ల కూడా జీరో దందానే సాగుతున్నది. ఎర్రాయిపేట, కొల్లూరుతో పాటు ఇతర చోట్ల అనుమతులు తీసుకున్నామని చెప్పి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తున్నారు. అధికారికంగా కంటే అనధికారికంగానే రెట్టింపు ఇసుక వివిధ ప్రాంతాలకు తరలిపోతున్నది. పర్మిషన్ తీసుకున్న ఇసుక రీచ్‌ల నుంచి పర్మిట్లు ఉన్న లారీల్లోనే ఇసుక తరలించాలి. కానీ.. ఇందుకు భిన్నంగా వే బిల్లులు లేకుం డా, గవర్నమెంట్‌కు డీడీలు కట్టకుండా సగానికిపైగా లారీలు నడుస్తున్నాయి. ఒక్క వే బిల్లుపైనే నాలుగైదు ట్రిప్పులు నడిపిస్తున్నారంటే దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు తనిఖీ చేసినప్పుడు త ప్ప.. మిగిలిన సమయాల్లో పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు. మరోవైపు ప్రతిలోడ్లో అదనపు బకెట్లు వేసి వేలాది రూపాయలు దండుకుంటున్నారు.
పది టన్నుల లోడ్‌లో మరో మూడు, నాలుగు బకెట్లు అదనంగా వేసి రూ. 8 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక పర్మిట్లు, వే బిల్లులు లేకుండా టిప్పర్లలో తరలించే ఒక్కో లోడ్‌కు రూ.30 వేల నుంచి రూ.40 వేలకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇంత యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. జైపూర్ మండ లం ఇందారంలో ఇసుక అక్రమ రవా ణా చేసే ఓ వ్యక్తి రెవెన్యూ, మైనింగ్ శాఖలతో పాటు పోలీసు శాఖ ఉన్నతాధికారులు ప్రతి నెలా చదివింపులు చేస్తారట. అధికారి స్థాయిని అనుసరించి రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా లంచం ఇస్తారని ఓ లారీ డ్రైవరే స్వయం గా చెప్పారు. ఒక్క జైపూర్ మండలంలోనే ఇంత పెద్ద మొత్తంలో మామూళ్లిస్తుంటే.. ఇక గోదావారి పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక తరలించేవారు ఇచ్చే మామూళ్లు భారీ మొత్తంలో ఉంటాయనే చర్చ నడుస్తున్నది. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడో లేదా ఏదైనా పేపర్లో వార్త వచ్చినప్పుడో తనిఖీలు చేసి, ఒకటీ రెండు కేసులు నమోదు చేసి పని చేసిన ట్లు చూపించుకోవడం తప్ప అధికారులు ఏం చేయరనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
ఇసుక అక్రమ రవాణా వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తమున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జైపూర్, కోటపల్లికి చెందిన కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే జోరుగా జీరో దందా సాగుతున్నట్లు తెలుస్తున్నది. ఇక పోతే నిత్యం ఇసుక లారీలతో కోటపల్లి మండలం పారుపల్లి ప్రాం తంలో వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పారుపల్లి ఎక్స్‌రోడ్‌కు ఇరువైపులా లారీలు నిలుపుతున్నారు. ఆ లారీల టైర్లతో వచ్చే బురుద రోడ్డు పైకి చేరుతున్నది. చిన్నపాటి వర్షం పడితే చాలు వాహనాలు వెళ్లలేని పరిస్థితి దాపురిస్తున్నది. నిబంధనల ప్రకారమైతే ఇసుక రీచ్‌ల నిర్వాహకులే పార్కింగ్ యార్డులు పెట్టుకోవాలి. కానీ ఇక్కడ పెట్టడం లేదు. పైగా పార్కింగ్ యార్డులు పెట్టినట్లు బిల్లులు సైతం పెట్టుకొని ప్రభుత్వ ఖజానాకు గండి పెడుతున్నారు.
ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిఘా పెట్టాం. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో వేంపల్లి, ఖర్జీ రీచ్‌ల నుంచి ఇసుక తవ్వకాలను ఆపేశాం. ఇసుక అక్రమ డంప్‌ల విషయం మాకు తెలిసింది. కాకపోతే డంప్‌లపై చర్యలు తీసుకునే అధికారం తహసీల్దార్లది. డంప్‌ల నుంచి ఇసుక తరలింపు ఇంకా మొదలవ్వలేదు. ఎప్పుడు ఇసుక బయటికి వచ్చినా పట్టుకునేందుకు మా టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పట్టుబడిన వాహనాలకు జరిమానాలు సైతం విధిస్తున్నాం. – జగన్మోహన్రెడ్డి, మైనింగ్ శాఖ ఏడీ