ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా సాగుతున్నది. తల్లులిద్దరూ గద్దెలపై కొలువుదీరగా.. భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఆయాచోట్ల బారులు తీరి అమ్మవార్లను దర్శించుకొని జేజేలు పలికారు. ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, నిలువెత్తు బంగారం( బెల్లం) సమర్పించి కుటుంబ సభ్యులంతా బాగుండాలని వేడుకున్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు 75 కిలోల ఎత్తు బంగారం (బెల్లం)అమ్మవార్లకు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు-రాజకుమారి దంపతులు, కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు మొక్కులు తీర్చుకున్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి తీరాన లక్షెట్టిపేట సీనియర్ సివిల్ జడ్జి అర్పితా మారం రెడ్డి, శ్రీరాంపూర్ ఇన్చార్జి జీఎం రఘుకుమార్, డీజీఎం పర్సనల్ అరవిందరావు సమ్మక్క-సారలమ్మకు పూజలు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.