నార్నూర్, మే 27 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఫిబ్రవరి నుంచి వేసవిలో అదనపు భత్యం అందించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్య కారణంగా అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధి హామీ పథకం మొదలైనప్పటి నుంచి రాష్ట్రం రూపొందించిన టీసీఎస్ స్టాఫ్ట్వేర్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించారు. రెండేళ్ల క్రితం కొత్తగా రూపొందించిన సాఫ్ట్వేర్ అమల్లోకి తీసుకువచ్చారు. 2022 వరకు దానిని వినియోగించారు. ఇందులో వేసవి భత్యాలకు సంబంధించిన అవకాశం లేకుండాపోయింది. దీంతో ఉపాధి కూలీలు ఆందోళన చెందుతున్నారు.
ఒక్కో నెల ఒక్కో మాదిరిగా….
వేసవిలో కూలీ శ్రమకు అదనంగా 20 నుంచి 30 శాతం వరకు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఐదు నెలలు పాటు ఆదనపు భత్యం అందించేవారు. ఒక్కో నెలలో ఒక్కో వి ధంగా చెల్లించే వారు. వేసవిలో ఒక కూలీ 60 శాతం ప ని చేస్తే దానికి 20 నుంచి 30 శాతం వరకు కలిపి..అంటే 80 నుంచి 90 శాతం వరకు పని చేసినట్లుగా డబ్బులు చెల్లించేవారు. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలలో 30 శాతం, జూన్‌లో 20 శాతం అదనపు భత్యం లభించేది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా అధికంగా శ్రమించాల్సి ఉంది. అలసట కారణంగా పూర్తిస్థాయిలో పని చేయలేరు. ఈ కారణంగా అదనపు భత్యం చెల్లించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు. అది రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, అయితే ప్రభుత్వం ఆదేశిస్తే నమోదు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
ఎక్కువ పనిదినాలు వేసవిలోనే…
నార్నూర్, గాదిగూడ మండలాల్లో అత్యధికంగా ఉపాధి హామీ పనులు చేస్తారు. యాసంగి వ్యవసాయ పనులు పూర్తి కాగానే వేసవిలో ఎక్కువ మంది ఉపాధి పనులకు హాజరువుతున్నారు. ఏప్రిల్ 1నుంచి జూన్ వరకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. నిత్యం వేలాది మంది కూలీ పనులకు వస్తున్నారు. వీరికి ప్రతి రోజూ రూ.240 వరకు కూలీపడే అవకాశాలు ఉన్నాయి. కొంత మందికి రూ.100నుంచి రూ.150 వరకు వస్తుంటాయి. కూలీలకు రెండేళ్ల క్రితం వేసవి భత్యం ఆదుకుంది. ప్రస్తుతం చెల్లించే అవకాశం లేకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడతారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వేసవిలో ఒక్కో కూలీకి ప్రతిరోజూ రూ.40 నుంచి రూ.60 వరకు తగ్గే అవకాశం ఉంది.
పథకం అమలు ఇలా…
నార్నూర్, గాదిగూడ మండలాల్లో మొత్తం 48 గ్రామ పంచాయతీల్లో 12,450పైన కుటుంబాలు ఉండగా, 18 వేల జాబ్‌కార్డులు కలిగి ఉన్నారు. వీరిలో యేటా దాదాపు 15వేలపైగా ఉపాధి కూలీ పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. గతేడాది వేసవిలో 70 శాతం మంది పనులకు వచ్చారు. యాసంగి పనులు ప్రారంభం కాగానే ఈ సీజన్లో కూలీల సంఖ్య కొంత తగ్గింది. ప్రస్తుతం అలవెన్స్‌లు తీసేశారనే సమాచారం తెలిస్తే ఇంకా కూలీల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. పథకం విజయవంతం కావాలంటే ఎండలో పనికి వెళ్లే కూలీలకు అలవెన్స్‌లు ఇవ్వకపోతే ఎలా సాధ్యమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కొత్త సాఫ్ట్‌వేర్‌లో అవకాశం లేదు..
కొత్త సాఫ్ట్‌వేర్‌లో వేసవి అలవెన్స్‌ల ఆప్షన్ లేదు. రెండేళ్ల నుంచి రద్దు చేశా రు. అధికారులు నుంచి ఏమైనా ఆదేశాలు వస్తే నమోదు చేస్తాం. ఉపాధి హామీ పథకం పనులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించే విధంగా పనులు గుర్తించారు. కూలీల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
-జాదవ్ సురేశ్, ఈజీఎస్ ఏపీవో, నార్నూర్