మంచిర్యాలటౌన్, ఆగస్టు 12 : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట రిటైర్డ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ కార్మికులు మాట్లాడుతూ వివిధ హోదాల్లో పనిచేసి విరమణ పొందిన తమకు కొన్నేళ్లుగా సంస్థ నుంచి రావాల్సిన పే ఫిక్సేషన్ ఏరియర్స్, టర్మినల్ లీవ్ ఎన్క్యాష్మెంట్ సెటిల్మెంట్ డబ్బులు రాలేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులకు వెంటనే గ్రాట్యుటీ, లీవుల డబ్బులు చెల్లించాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి, వారి కుటుంబ సభ్యులకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని, ఎస్ఆర్బీఎస్ లైఫ్ సర్టిఫికెట్ను ఆన్లైన్లో అందజేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. 30 ఏళ్లకు పై బడి సంస్థకోసం పనిచేసిన వారిని చివరికి ఇలా కష్టపెట్టడం సరికాదని, అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు కే ప్రకాశ్, మధుసూదన్, ఎండీ పాషా, జీఎస్ నారాయణ, వెంకటేశం పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతి
ఆసిఫాబాద్ టౌన్,ఆగస్టు12 : సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఎమ్మెల్యే కోవ లక్ష్మిని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యామని, పెండింగ్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చామన్నారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందించారని, ప్రభుత్వంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మల్లేశ్, కార్యదర్శి దివాకర్, ఆస్గర్, అమీర్ పాల్గొన్నారు.