మంచిర్యాల, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇండస్ట్రియల్ హబ్ పేరుతో దళిత రైతులను బెదిరించి సంతకాలు తీసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడి, వారిలో భరోసా నింపేందుకు మంగళవారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మంచిర్యాల జిల్లాకు రానున్నారు. హజీపూర్ మండలం ముల్కల్ల, వేంపల్లిలో ఇండస్ట్రియల్ హబ్ కోసం భూములు కోల్పోతున్న రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ కోసం 276.09 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి భూముల సేకరణ చేయాల్సి ఉన్నా, అధికార పార్టీ నాయకులు రైతులతో రహస్య సమావేశం నిర్వహించి బెదిరించి సంతకాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇలా బెదిరించి సంతకాలు తీసుకున్న కార్యక్రమానికి ఆర్డీవో, ఎమ్మార్వో వచ్చారని రైతులు చెబుతున్నా.. వారి గోడును పట్టించుకునే నాథులే కరవయ్యారు. ఈ విషయంపై బాధితులు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దళిత రైతులను భయభ్రాంతులకు గురిచేసి, బెదిరించి సంతకాలు తీసుకున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వయంగా బాధితులను కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు జిల్లాలో ఆయన మంగళవారం పర్యటిస్తారని బాధిత రైతులు తెలిపారు.