కౌటాల, డిసెంబర్ 2 : దరిగాం గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే నిధులు కాజేశారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని దరిగాం గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఈ గ్రామం వందేళ్ల నుంచి ఉన్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదన్నారు. చదువుకున్న అభ్యర్థిని స్థానిక ఎన్నికల్లో గెలిపించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
ఈ గ్రామానికి విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారిందని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కన్నయ్యను గెలిపిస్తే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఆయన వెంట నాయకులు కొంగ సత్యనారాయణ, మిన్హాజ్, పోచం, మహమూద్, వాసు, బాబర్, హనుమంతు, రవీందర్, తదితరులున్నారు.