రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రలోభాల పర్వంపై పోలీస్, అధికార యంత్రాంగం పూర్తి నిఘా పెట్టింది. సమస్యాత్మక కేంద్రాలపై ఫోకస్ పెడుతూనే కట్టుదిట్టమైన వ్యూహంతో ముందుకెళ్లింది. ఆయా జిల్లాల పరిధిలో ప్రత్యేక చెక్‌పోస్టులు, టీంలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టింది. పెద్ద ఎత్తున నగదు, మద్యం, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుంది. కాగా, మొత్తంగా రూ. 9,09,31,932, రూ. 3,22,51,011 విలువైన మద్యం పట్టుకుంది. దీంతో పాటు పలువురిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ప్రజానీకం ఊపిరి పీల్చుకున్నది.
– నిర్మల్( నమస్తే తెలంగాణ)/ఎదులాపురం, డిసెంబర్ 1
నిర్మల్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు. ప్రలోభాలపై దృష్టి పెట్టారు. గెలుపు కోసం పార్టీల నేతలు పెద్ద మొత్తంలో నగదు, మద్యం పంపిణీలకు శ్రీకారం చుట్టారు. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాలకనుగుణంగా జిల్లా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎస్పీ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో అన్ని పార్టీల అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా మద్యం, నగదు పంపిణీ చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు.
ఇందులో భాగంగానే ఆయా పార్టీల నేతలు, వారి అనుచరులు, కార్యకర్తలు నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిరంతర తనిఖీలతో దాదాపు రూ. కోటీ 50లక్షల నగదును స్వాధీనం చేసుకోవడం విశేషం. దీంతో పాటు రూ.28 లక్షల విలువైన మద్యం, నాటు సారాకు వినియోగించే బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ పోలీసుల కళ్లుగప్పి భారీ మొత్తంలో నగదు, మద్యం పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసినట్లు ఈ కాంగ్రెస బీజేపీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి జిల్లాలో మొత్తం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు 21 నమోదయ్యాయి. అలాగే ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల నడుమ జరిగిన గొడవలకు సంబంధించి 7 కేసులను నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
కాగా జిల్లా పోలీసులు తీసుకున్న ముందస్తు జాగ్రత్తల కారణంగా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎన్నికల నిర్వహణకు దాదాపు 2700 మంది కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలను వినియోగించారు. జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌తో పాటు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు బందోబస్తును పర్యవేక్షించారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 229 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జిల్లా పోలీసులు ఎంతో సమన్వయంతో వ్యవహరించడం వల్లనే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని పలువురు జిల్లా పోలీసులను ప్రశంసిస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్న అధికారులు రాజకీయ పార్టీల ప్రలోభాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. జిలాల్లో చెక్‌పోస్టులను పెట్టి వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల నిర్వహణ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో రూ. 2కోట్ల 24వేల 106ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధిత వ్యక్తుల వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. దాదాపు రూ.10 లక్షల విలువైన మద్యం, 300 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 3540 మందిని పోలీసులు బైండోవర్ చేశారు.
ఎదులాపురం, డిసెంబర్ 1: ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.1,61,31,251 నగదు సీజ్ చేశారు. జిల్లా పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, బోథ్‌తో పాటు ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల పరిధి మండలాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. దీంతో పాటు రూ. 42,12,292 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.25,61,769 ఉంటుంది. ఎన్నికల సందర్భంగా 405 కేసులు నమోదు కాగా, 407 మందిని అరెస్టు చేశారు. 310 బెల్ట్‌షాపులను మూసివేశారు. అదే విధంగా 80.660 కేజీల గంజాయి పట్టుకున్నారు. దీని విలువ రూ.20 లక్షల 48 వేలు ఉంటుంది. ఇందులో 8 కేసులు నమోదు కాగా 13 మందిని అరెస్టు చేశారు. 863 కేసుల్లో 1394 మందిని బైండోవర్ చేశారు.
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 1: మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున నగదు, మద్యం పట్టుకున్నారు. ఇందులో మొత్తంగా రూ. 3,99,02,018 నగదు పట్టుబడింది. దీంతో పాటు 61913.06 లీటర్ల నగదు పట్టుకోగా, దీని విలువ 2,58,89,443 ఉంటుంది. దీంతో పాటు మాదక ద్రవ్యాల విలువ రూ. 6,51,285గా ఉంటుంది. ఇక బంగారం, చీరెలు, టీషర్టుల విలువ రూ 21,89, 000 ఉంటుంది. వాహనాలు 32 పట్టుబడ్డాయి. ఇక మొత్తంగా 665 కేసులు నమోదయ్యాయి.