భారీగా టీయూఎఫ్ఐడీసీ నిధుల విడుదల
మూడు బల్దియాలకు రూ.53.45 కోట్ల నిధులు
మౌలిక సదుపాయాల కల్పనకే రూ.46 కోట్లు
సుందరీకరణ, ఇతర పనులకు రూ.7.45 కోట్లు
నిర్మల్, మార్చి14 (నమస్తే తెలంగాణ) : మున్సిపాలిటీల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం భారీగా నిధులను మంజూరు చేస్తున్నది. నిర్మల్ జిల్లాలోని భైంసా, నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలో చేపట్టే పలు అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ. 53.45 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటితో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు ఇతర సదుపాయాల కల్పనకు రూ.46 కోట్లను కేటాయించింది. అలాగే నిర్మల్‌లో పట్టణం సుందరీకరణతో పాటు, పచ్చదనం పెంపొందించడం, ప్రధాన కూడళ్ల అభివృద్ధికి మరో రూ. 7.45 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీయూఎఫ్ఐడీసీ) ఫేజ్-3 నిధులతో ఆయా పనులను చేపడుతున్నారు.
మారనున్న రూపురేఖలు…
పెద్దఎత్తున విడుదలైన నిధులతో పట్టణాల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటికే టీయూఎఫ్ఐడీసీ మొదటి, రెండో విడుతల్లో మంజూరైన నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాన్ని చేపట్టారు. ప్రస్తుతం మూడో విడత నిధులతో దాదాపు అన్ని కాలనీల్లో పనులు జరుగనున్నాయి. నిర్మల్ మున్సిపాలిటీకి రూ. 23.45 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటిలో రూ. 16 కోట్లను మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయనున్నారు. మొత్తం 42 వార్డుల పరిధిలో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణంతో పాటు అందరికీ అందుబాటులో ఉండేలా ఎక్కడికక్కడ శ్మశాన వాటికలను నిర్మించనున్నారు. అలాగే శివారు ప్రాంతాల్లో డంప్ యార్డులను ఏర్పాటు చేయనున్నా రు. ఇదిలా ఉంటే మరో రూ. 7.45 కోట్ల నిధులను.. ప్రధాన కూడళ్ల వద్ద సుందరీకరణ పనులు, క్లాక్ టవర్ నిర్మాణానికి వెచ్చించనున్నా రు. కాగా ఆయా పనులకు త్వరలోనే టెండరు ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవి కాకుండా నిర్మల్ పట్టణాభివృద్ధికి మరో రూ. 20 కోట్లను ప్రత్యేక గ్రాంటు కింద మంజూరు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పారు. వీటితో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాత పట్టణాన్ని కలిపే చైన్‌గేట్ నుంచి బంగల్పేట్ వరకు వెళ్లే రోడ్డును బీటీ రోడ్డుగా మార్చి సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తికాగా ఇరువైపులా డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి. అలాగే అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకం వద్ద బ్యూటిఫికేషన్ పనులను చేపట్టనున్నారు. ఈ పనులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇప్పటికే శంకుస్థాపన కూడా చేశారు. వీటితోపాటు అంబేద్కర్ విగ్రహం నుంచి భైల్ బజార్ వరకు ప్రధాన రోడ్డుకిరువైపులా రెండో విడత ఫుట్‌పాత్ అభివృద్ధి పనులకోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
రూ.30కోట్లతో భైంసా, ఖానాపూర్‌లో పనులు…
ఖానాపూర్ పట్టణంలో మొత్తం 12 వార్డులు ఉండగా, వాటిలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పట్టణంలోని ప్రధాన రోడ్డు వెడల్పు పనులకోసం రూ.20కోట్ల అంచనాలతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిలో రూ. 16.50 కోట్ల పనులకు ఆమో దం లభించడంతో ఆయా పనులకు టెండరు ప్రక్రియను పూర్తి చేసి పనులను సైతం ప్రారంభించారు. పట్టణానికి వచ్చే ప్రధాన రోడ్డే ఇక్క డ పెద్ద సమస్యగా మారింది. దీంతో ఈరోడ్డు విస్తరణకే అధిక ప్రాధాన్యతనిచ్చిన అధికారులు రూ.15కోట్లతో పనులను చేపడుతున్నారు. ఈ రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మాణాన్ని పూర్తిచేసి, సెంట్రల్ లైటింగ్ సిస్టంను కూడా ప్రారంభించారు.
అలాగే మరో కోటిన్నర నిధులతో 3 చోట్ల సీసీతో మురుగునీటి కాలువల నిర్మాణం చేపడుతున్నారు. మి గతా రూ.3.50 కోట్ల పనులకు ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ఆయా కాలనీల్లో అవసరమైన చోట సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడుతామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే భైంసా ము న్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుల్లో అభివృద్ధి పనులకోసం రూ. 10కోట్లు మంజూరయ్యాయి. ఈనిధులతో పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను చేపట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృషి వల్లే..
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లా అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను మంజూ రు చేయించారు. ఆయన కృషి వల్లనే ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత స్వరాష్ట్రంలో నియోజకవర్గ, జిల్లా కేంద్రాల సుందరీకరణతోపాటు రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టం తదితర పనులకు ప్రభుత్వం అధిక నిధులను కేటాయిస్తున్నది. దీంతో పట్టణాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి.
–గండ్రత్ ఈశ్వర్, మున్సిపల్ చైర్మన్, నిర్మల్
టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి..
టీఆర్ఎస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతున్నది. ఒక వైపు సంక్షే మ కార్యక్రమాలు అమలు చేస్తూనే రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనే విస్తరించిన రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, రోడ్ల మధ్యలో అందమైన చెట్లు ఫుట్‌పాత్‌లు కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం కనిపిస్తున్నాయి.
–కుర్ర నరేశ్, వ్యాపారి, నిర్మల్