కుభీర్ : నిర్మల్ జిల్లాలోని కుభీరు ( Kubheer ) మండలంలో నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన పంట సోయాబీన్( Soyabeen ) , పత్తి ( Cotton ) పంటలు తీవ్రంగా దెబ్బతిని కర్షకుడికి కన్నీళ్లను మిగిల్చాయి. పంట చేతికి వస్తుందన్న సమయంలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో సోయా పంట చేలల్లో కోత వేయకముందే మొలకలు వచ్చి తీవ్ర నష్టాన్ని కలిగించింది.
పత్తి చేలల్లో వచ్చిన కాత అధిక వర్షపాతం కారణంగా కాయలు మక్కిపోయి ఊడి కింద పడుతున్నాయి. దీంతో మండల రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 50,788 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా సాగు భూములు ఉండగా ఇందులో 24,066 ఎకరాల్లో పత్తి , 22,855 ఎకరాల్లో సోయా సాగు , 1,242 ఎకరాల్లో మొక్కజొన్న, 2,452 ఎకరాల్లో కంది పంటలను సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
మొక్కజొన్నకు ఎలాంటి నష్టం జరిగక పోయినప్పటికీ ప్రధానంగా సోయాబీన్, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతుల పంటలను సర్వే చేపట్టి ఎకరాకు కనీసం రూ. 20 వేల నష్టపరిహారం అందించాలని బోయిడి సురేష్ అనే రైతు డిమాండ్ చేశారు.