ఆదిలాబాద్/నిర్మల్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : వంట గ్యాస్ వినియోగదారులపై బండ బాదుడు మొదలైంది. గృహ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పెంచిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు రూ.875(14.2 కేజీలు)లు ఉన్న సిలిండర్ ధర రూ.50తో కలిపి రూ.925కు చేరుకున్నది. ఇతర పన్నులు రూ.5లతో కలిపి రూ.930కు చేరింది. కాగా.. రూ.503 ధర ఉన్న ఉజ్వల సిలిండర్‌కు కూడా పెంపు వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది.
దీంతో నిరుపేదలు వినియోగించే ఉజ్వల సిలిండర్ ధర రూ.553కు చేరుకున్నది. నిరుపేదలపై కనీస కనీకరం లేకుండా కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌పై అదనపు భారం మోపడంపై వారు మండిపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు పెరిగాయని, ఇతర కారణాలు చూపుతూ ఒక్కో సిలిండర్‌పై రూ.50 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పండుగ పూట తీసుకున్న నిర్ణయం సామాన్యులకు భారంగా మారింది. తాజాగా పెరిగిన గ్యాస్ ధర భారం కానున్నది.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 2,51,785 ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఉజ్వల కనెక్షన్లు 37,249, సాధారణ కనెక్షన్లు 1,39,430, దీపం పథకం కింద పేదలకు ఇచ్చిన కనెక్షన్లు 47,215 ఉన్నాయి. వీటితోపాటు సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కనెక్షన్లు 26,828, ఇతర కనెక్షన్లు 1,063 ఉన్నాయి. అయితే ప్రస్తుతం పెరిగిన ధరతో నిర్మల్ జిల్లావాసులపై ఏకంగా రూ.1.25 కోట్లకు పైగా అదనపు భారం పడుతుంది. ఎల్పీజీతోపాటు ఇంధన ధరలను ప్రతి నెల సమీక్షిస్తామని కేంద్రం ప్రకటించడంతో భవిష్యత్‌లో కూడా ధరలు పెరిగే అవకాశం ఉన్నదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఆదిలాబాద్ వాసులపై రూ.1.44 కోట్ల అదనపు భారం
ఆదిలాబాద్ జిల్లాలో 2,88,346 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో జనరల్ కనెక్షన్లు 2,05, 250, దీపం 46,136, ఉజ్వల పథకం కింద 36,960 కనెక్షన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా ప్రతి నెల రూ.1.44 కోట్ల అదనపు భారం పడనుంది.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్ ధరలను ఒకేసారి రూ.50 పెంచి పేదలపై భారాన్ని మోపింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింద అర్హులందరికీ రూ.500లకే సిలిండర్ ఇస్తామన్నారు. అది ఎవరికి ఇస్తున్నారో దేవుడికే తెలియాలి. మాకు అన్ని అర్హతలు ఉన్నా రూ.500 గ్యాస్ పథకం రాలేదు. గ్యాస్ ఏజెన్సీలు నిర్ధేశిత కిలోమీటర్ల వరకు ఉచితంగా గ్యాస్ డెలివరీ చేయాలని నిబంధన ఉన్నప్పటికీ, డెలివరీ బాయ్స్ కూడా రవాణా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇలా ఎవరికీ వారు అడ్డంగా దండుకోవడం వల్ల మా లాంటి పేదలపై మోయలేని భారం పడుతున్నది.
– అనూష, గృహిణి, ముజ్గి, నిర్మల్ మండలం.