ఆదిలాబాద్, సెప్టెంబర్ 5 ( నమస్తే తెలంగాణ): ఓ వైపు ఇటీవల కురిసిన వర్షాలు..మరోవైపు జాతీయ రహదారి 353(బీ) నిర్మాణ పనుల కోసం భారీ వాహనాల రాకపోకలు, ఇంకో వైపు గుంతల మయమైన దారులకు ప్రభుత్వం మరమ్మతులు చేయించకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని రోడ్లు అధ్వానంగా మారాయి. బురదమయం, గుంతల రోడ్డుపై కనీసం నడిచి వెళ్లడం కూడా నరక ప్రాయంగా మారిందని మండల ప్రజలు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మండలంలోని భవానీగూడ, ఏకోరి, మసాల (బీ), సైద్పూర్ వరకు రెండు వరుసల బీటీ రోడ్డు నిర్మాణాలను చేపట్టింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పరిధిలోకి వచ్చే ఈ రోడ్డు నిర్మాణాన్ని రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారులు పట్టించుకోవడం లేదు. గుంతలమయమైన రోడ్లపై బేల మండల కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు వివిధ గ్రామాల ప్రజలు ప్రతి రోజూ ఇబ్బంది పడుతున్నారు.
భారీ వాహనాలతో రోడ్లు ధ్వంసం
బేల మండల కేంద్రం నుంచి బోరజ్ వరకు జాతీయ రహదారిని కలిపేలా ఎన్‌హెచ్ 353 (బీ) నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కంకర, మట్టి, తదితర సామగ్రి తరలించేందుకు భారీ వాహనాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా తిరుగుతున్నాయి. ఇటీవల వర్షాలతో దాదాపు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీనికి తోడు 60 నుంచి 70 మెట్రిక్ టన్నుల బరువు గల భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో మరింత పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వాటిలో వర్షపు నీరు నిలిచి రోడ్డంతా బురదమయంగా మారింది.
దీంతో వాహనదారులతో పాటు పాదచారులు కూడా ఆ రోడ్డుపై వెళ్లేందుకు తిప్పలు పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గర్భిణులు, వైద్య సేవల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన వారి కోసం వాహనాలు సైతం రావడం లేదంటున్నారు. రహదారిపై వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని రోడ్డు నిర్మాణ పనుల నిర్వాహకులు మచ్చిక చేసుకుని తమ పనులు కొనసాగిస్తున్నారు. అధికారులు స్పందించి భారీ వాహనాలను నియంత్రించాలని, రహదారులు పాడవకుండా చర్యలు తీసుకోవాలని, మరమ్మతులు చేయించాలని మండల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
రోడ్డుపై వెళ్లాలంటే భయంగా ఉన్నది..
బేల నుంచి భవానీగూడకు పోయే రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు రిపేర్‌ను అధికారులు పట్టించుకుంట లేరు. దీంతో ఇంకా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డయ్. ఆరు నెలలుగా ఈ రోడ్డుపై పెద్ద పెద్ద టిప్పర్లలో మొరం తీసుకెళ్తున్నరు. దీంతో గుంతలు పడినయ్. ఈ రోడ్డుపై వెళ్లాలంటే ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుంతోనని భయంగా ఉంది. గుంతలను తప్పించేందుకు వాహనదారులు ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలే.
– కిశోర్, భవానీగూడ, బేల మండలం