నా పేరు మానెపల్లి పోసుబాయి. నార్లపూర్ శివారులో మాకు ఐదెకరాల భూమి ఉంది. ఇందుకు సంబంధించిన రెవెన్యూ పట్టా కూడా ఉంది. ఇన్నాళ్లూ మా భూమిల్లోకి ఎవరూ అడుగుపెట్టలేదు. ఇప్పుడు అటవీశాఖ అధికారులు వచ్చి ఈ భూములు అటవీశాఖకు చెందినవని చెబుతున్నరు. సాగు చేయకుండా అడ్డుకుంటున్నరు. ఇదెక్కడి న్యాయం. మా భూములను అస్సలు వదులుకునేదే లేదు.
నా పేరు దేవాజీ. నార్లపూర్ శివారులో 5 ఎకరాల భూమి ఉంది. దీనికి రెవెన్యూ పట్టా కూడా ఉంది. అయినప్పటికీ అటవీ అధికారులు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నరు. నార్లపూర్, అంకుసాపూర్ గ్రామాల శివార్లలో దాదాపు 50 మంది రైతులకు 150 నుంచి 200 ఎకరాల వరకు రెవెన్యూ పట్టాలున్నయి. అటవీ అధికారులు వచ్చి రెవెన్యూ పట్టాలున్న భూములను కూడా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నరు. ఇది సరికాదు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో అటవీ భూములేవో.. రెవె న్యూ భూములేవో.. తెలియక అధికారులకు తలనొప్పిగా మారగా.. ఇటు సాగు పనుల్లో నిమగ్నమైన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెవె న్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా అటవీ భూములు-రెవెన్యూ భూముల మధ్య హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో రైతాంగం అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. కాగజ్‌నగర్‌లోని అంకుసాపూర్ శివారులో ఏళ్లకేళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు రెవెన్యూ శాఖ రెండు మూడేళ్ల క్రితం పట్టాలు జారీ చేసింది. అయితే గత గురువారం ఆ భూముల్లో రైతులు సాగు చేసుకుంటుండగా, అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. రెవెన్యూ శాఖ జారీ చేసిన పట్టాలను అటవీ అధికారులకు చూపిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై అధికారులకు స్పష్టత లేకపోవడంతో గొడవకు దారితీసినట్లు తెలుస్తున్నది. జిల్లాలోని అటవీ భూములకు దాదాపు 9 వేలకు పైగా రెవెన్యూ శాఖ ద్వారా పట్టాలు జారీచేసినట్లు సమాచారముండగా, అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తున్నది.
జిల్లాలో అటవీ-రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం రైతులకు శాపంగా మారుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 21,753 ప్రాంతాల్లో అటవీ-రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. దాదాపు 90 వేల ఎకరాల అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు అటవీ అధికారులు గుర్తించారు. జిల్లాలో దాదాపు ఈ అటవీ భూములకు రెవెన్యూ అధికారులు సుమారు 9 వేల మందికి పైగా రైతులకు పట్టాలు జారీచేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ ఏర్పాటు చేయడంతో ఆక్రమణల్లో ఉన్న అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీ శాఖ చర్యలు చేపడుతోంది.
ముఖ్యంగా గిరిజనేతరుల సాగులో ఉన్న సుమారు 90 వేల ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ హక్కు పత్రాలను పొందిన గిరిజన రైతులను మినహాయించి మిగతా వారి ఆక్రమణల్లో ఉన్న అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలుచేపడుతున్నారు. ఈ క్రమంలో కాగజ్‌నగర్ మండలం నార్లపూర్, అంకుసాపూర్ గ్రామాల్లో గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న అటవీ భూముల్లోనికి వెళ్లిన అధికారులకు కొత్త సమస్య ఎదురైంది. ఇక్కడ రైతులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న అటవీ భూములకు రెవెన్యూ శాఖ గతంలోనే పట్టాలు ఇవ్వగా, ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ పథకాలను కూడా పొందుతున్నారు. పట్టాలు పొందిన సాగు భూముల్లోకి వచ్చి అటవీ అధికారులు అడ్డుకోవడం పెద్ద వివాదంగా మారుతోంది.
కాగజ్‌నగర్‌లోని అంకుసాపూర్, నార్లపూర్ గ్రామాల పరిధిలో దాదాపు 50 మంది రైతులకు 200 ఎకరాల వరకు గతంలో రెవెన్యూ శాఖ ద్వారా పట్టాలు ఇచ్చారు. పట్టాలు పొందిన రైతులు చాలా ఏళ్లుగా సాగులో ఉన్నారు. గత ప్రభుత్వం ధరణి తీసుకువచ్చిన తర్వాత వీరికి పట్టాలు అందాయి. ఇప్పుడు ఈ భూములు అటవీ శాఖ తమదని వాదిస్తోంది. అటవీ శాఖకు చెందిన ఈ భూములను రైతుల నుంచి స్వాధీనం చేసుకునేందుకు అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. రైతులు సాగుచేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం ఈ ప్రాంతంలో సాగులో ఉన్న రైతులను అడ్డుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నించడంతో రైతులు అటవీ అధికారులపై తిరగబడ్డారు. దీంతో చేసేదేమిలేక అటవీ అధికారులు వెనుదిరిగారు.