వాంకిడి : ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులను ( Revenue conferences ) నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ( Collector Venkatesh Dotre) తెలిపారు. బుధవారం జిల్లాలోని వాంకిడి మండలం అర్లి గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు సందర్శించి అర్జీదారుల సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం అమలుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని అన్నారు. భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తు లు స్వీకరించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని వివరించారు.
రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్లో నమోదు చేసి రికార్డులతో సరి చూసి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ రకాల సమస్యలపై వచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా వేరు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో తహసిల్దార్ డి కవిత, మండల సర్వే యర్ పుల్గం రామకృష్ణ, గిర్దావార్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.