కాగజ్‌నగర్, ఆగష్టు 12 : కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు కనీసం వేతనాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇకనైనా చొరవ తీసుకొని వారి సమస్యకు పరిష్కారం చూపాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కాగజ్‌నగర్‌లో 19 రోజులుగా కార్మికులు చేపడుతున్న సమ్మెకు సోమవారం మద్దతు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కూడా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, ప్రకటనల ఖర్చులు తగ్గించుకుంటే వేలాది మంది కార్మికుల సమస్య పరిష్కరించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ కన్వీనర్ లెండుగూరే శ్యాంరావు, నాయకులు మనోహర్, ఓదెలు పాల్గ్గొన్నారు.
ప్రత్యేక గ్రాంటు మంజూరు చేయాలి
కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రాంటు మంజూరు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్, మున్సిపల్ కమిషనర్ అంజయ్యను కోరారు. కాగజ్‌నగర్ మున్సిపల్ కార్మికుల సమస్యలపై విచారణకు వచ్చిన ఆర్డీ షాహిద్ మసూద్‌ను ఆయన మున్సిపల్ కార్యాలయంలో కలిసి మాట్లాడారు.
ఆర్డీతో పాటు మున్సిపల్ కమిషనర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీకి ప్రతి నెలా కేవలం రూ.10 లక్షల ఆదాయమే వస్తుందని, కార్మికులకు ప్రతి నెలా వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపులు కలిపి రూ.41 లక్షలు అవసరముందన్నారు. మున్సిపాలిటీకి ఆదా యం లేనప్పుడు ఇంత మంది కార్మికులకు ఎందుకు నియమించారని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం
కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని కౌన్సిలర్లు స్పష్టం చేశారు. మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్య గురించి చెబుతామని, పరిష్కారం కాకపోతే కౌన్సిలర్లందరం రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు.
సమ్మె విరమించేది లేదు
సమస్య పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేశారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని, మూడు రోజుల్లో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీ షాహిద్ మసూద్ హామీ ఇచ్చారు. తక్షణమే సమస్య పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని, లేదంటే కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
పూర్తిస్థాయి సేవలు నిలిపివేత
కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని కార్మికులు పూర్తి స్థాయి సమ్మెకు దిగుతున్నారు. మంగళవారం నుంచి వివిధ విభాగాల్లో విధులు నిర్వహించే కార్మికులు సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘం అధ్యక్షుడు శంకర్ తెలిపారు.