మంచిర్యాల, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మంచిర్యాల జిల్లాకు వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాల్లో ఏ సీఎం కూడా ఎమ్మెల్సీ ఎన్నికలను ఇంత సీరియస్‌గా తీసుకోకపోవడం, కానీ.. ఈ ఎన్నికల్లో స్వయంగా సీఎం రంగంలోకి దిగడం తీవ్రమైన చర్చనీయాంశమైంది. రేవంత్‌రెడ్డి ప్రచారంతో కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ వేసుకుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే స్వయంగా సీఎం రంగ ప్రవేశం చేశారనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సీఎం మాట్లాడిన తీరు ఓటర్లను అయోమయంలో పడేసేలా ఉందంటున్నారు. సీఎం మాటల్లో అస్పష్టత, గందరగోళం కనిపించింది. డీఎస్సీ నోటిఫికేషన్, పోలీసు ఉద్యోగాలు, పారామెడికల్ సిబ్బంది ఉద్యోగాలు ఇచ్చామని.. రైతు రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. తాను చెప్పినవన్నీ నిజాలైతేనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటెయ్యాలని.. లేకపోతే మీకు నచ్చిన వ్యక్తికి ఓటెయ్యాలంటూ పిలుపునిచ్చారు.
వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంత వరకూ సంపూర్ణంగా రైతు రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాలు బూచీగా చూపి చాలా మంది రైతులకు రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ కాక సహకార సంఘాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు ఎంతో మంది ఉన్నారు. రైతు భరోసా పెట్టుబడి సాయం అరకొరగానే జమ చేశారు. కేవలం 3 ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న వారికే ఎకరాకు రూ.6వేలు చొప్పున జమ చేశామని ప్రభుత్వం చెప్పినప్పటికీ వాస్తవానికి అర్హులైన వారిలో సగానికి ఎక్కువ మందికి రైతుభరోసా అందలేదు.
గృహలకు 200 యూనిట్లు, రూ.500 గ్యాస్ సిలిండర్, సన్నవడ్లకు బోనస్ ఇప్పటి దాకా అందని లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో జనాలంతా ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వాటినే సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించడం, ఈ పథకాలు వస్తేనే ఓటేయండి లేకపోతే మీ ఇష్టం అని ప్రకటన చేయడంతో ఇప్పుడు ఈ బాధిత కుటుంబాల్లోని పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సీఎం టూర్‌తో కాంగ్రెస్ అభ్యర్థికి జరిగిన మేలు కంటే.. నష్టమే ఎక్కువైపోయిందనే చర్చ ఇప్పుడు జిల్లాలో నడుస్తున్నది.
సీఎం ప్రసంగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన హామీలు రాలేదు. స్థానిక ఎమ్మెల్యే పీఎస్ఆర్ మంచిర్యాల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్‌కు రూ.78 కోట్లు కావాలని, గూడెం గుట్ట, విశ్వనాథ ఆలయాల అభివృద్ధిని నిధులు కావాలని కోరారు. కానీ సీఎం ప్రసంగంలో వీటిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మంచిర్యాలలో సభ ఆలస్యంగా మొదలైంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ సీఎం రావడం ఆలస్యమైంది.
దీంతో సాయంత్రం 5 గంటల దాకా ఓపికతో కూర్చున్న జనాలు.. విసుగెత్తిపోయారు. సీఎం ప్రసంగం మధ్యలోనే లేచి సీఎం మాట్లాడుండగా జనాలు వెళ్తున్నట్లు గుర్తించిన కాంగ్రెస్ లీడర్లు, పోలీసులు వారిని కాసేపు అడ్డుకున్నారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.