ఎదులాపురం, ఫిబ్రవరి 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల సమస్యలను పట్టించుకోవడం లేదని తుడుం దెబ్బ రాష్ట్ర నాయకుడు గోడం గణేశ్ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం కాలనీలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారికి ఇంటి నంబర్లు, కరెంట్ మీటర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టారు. ఆదివాసీ సాంప్రదాయ వాయిదాలు డోలు, కికిరి వాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
మున్సిపల్ ప్రదాన గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఆదివాసులనులోనికి వెళ్లనివ్వకుండా పోలీసులు గేటును మూసి వేసి బందోబస్తు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జీ. రాజుకు వినతిపత్రం అందించి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర నాయకుడు గోడం గణేశ్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా కుమ్రం భీం కాలనీలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న ఆదివాసులకు కనీససౌకర్యాలు కల్పించడం లేదన్నారు. సమస్యలపై పలు మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదన్నారు. కనీసం రోడ్డు, తాగునీటి వసతి కూడా కల్పించలేదన్నారు.
పిల్లల భవిష్యత్ ఉపాధి కోసం అడవులను వదిలి పట్టణంలో స్థిరపడుదామని వస్తే వసతులు కల్పించడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కాలనీలో నివాసం ఉంటున్న వారికి ఇంటి నంబర్లు, మీటర్లు ఇవ్వాలని, కనీస వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు ఇంద్ర, రేణుక, వెట్టి మనోజ్, సలం జంగు, గణపతి, నాగోరావు పాల్గొన్నారు.