గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అన్ని మండలాల్లో ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లా కేంద్రాలతో పాటు అన్ని మండలాల్లో ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, హాస్పిటళ్లు, పోలీస్స్టేషన్లు, ప్రైవేట్ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాల కార్యాలయాల ఆవరణలో జాతీయ జెండాలను అధికారులు, నాయకులు ఎగురవేశారు.
ఎదులాపురం, జనవరి 26: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్‌లోని పరేడ్ మైదానంలో ఆయా పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. దేశ భక్తి, జానపద పాటలపై నృత్యాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా విద్యార్థులను వేదికపై కలెక్టర్ రాజర్షి షా. ఎస్పీ గౌస్ ఆలం, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అభినందించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం లో ఎస్పీ గౌష్ ఆలం త్రివర్ణ పతాకాన్ని ఆవిషరించారు. రిజర్వ్ పోలీస్ సిబ్బంది గౌరవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, డీసీఆర్బీ డీఎస్పీ సీహెచ్ నాగేందర్, పట్టణ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, రిజ ర్వ్ ఇన్స్పెక్టర్లు డీ వెంకటి, టీ మురళి, బీ శ్రీపాల్, తదితరులున్నారు. ఆదిలాబాద్ కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను మాజీ మంత్రి జోగు రామన్న ఎగురవేశారు మొదట శాంతి నగర్లో కాలనీ వాసులతో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఖానాపూర్ లో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. వీజీఎస్ అకాడమీ వద్ద, ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల భవనంలో విశ్రాంతి ఉద్యోగులతో కలిసి జాతీయ జెండాలను ఆవిషరించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు.
బోథ్, జనవరి 26 : బోథ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉట్నూర్, జనవరి 26 : ఐటీడీఏ ప్రాంగణంలో ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్‌తో కలిసి ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా జెండా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మండల కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పలుచోట్ల జెండా ఆవిష్కరించారు. బీఆర్ఎస్ ఇన్చార్జి మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్‌లో జెండా ఎగురవేశారు.
నిర్మల్ అర్బన్, జనవరి 26 : మహనీయుల అడుగుజాడల్లో నడవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. కలెక్టరేట్, క్యాంపు కార్యాలయం, జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయాల్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఏఎస్పీ రాజేశ్ మీనా, ఉపేందర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కోర్టులో జిల్లా జడ్జి కర్ణ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో జిల్లా అధికారులు జెండాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలు, కళాశాలలో వేడుకల్లో భాగం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఖానాపూర్, జనవరి 26: ఖానాపూర్లోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్‌నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బీఆర్ఎస్ తరుఫున తెలంగాణ చౌరస్తాలో పట్టణ అధ్యక్షుడు గౌరికర్ రాజు ఆవిష్కరించారు. పట్టణంలో పలు చోట్ల జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో జాన్సన్‌నాయక్ పాల్గొని నియోజకవర్గ ప్రజలకు, యువతకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముథోల్, జనవరి, 26 : బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ జెండాను ఆవిష్కరించారు. ఎన్సీసీ విద్యార్థుల కవాతు, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని చాటాయి.
భైంసా, జనవరి, 26 : భైంసా ఏరియా దవాఖానలో ఆసుపత్రిలో, బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రామారావు పటేల్, పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్పీ అవినాష్ కుమార్ జెండాలను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ ఇన్చార్జి విలాస్ గాదేవార్ జెండాను ఆవిష్కరించారు.