బెజ్జూర్, సెప్టెంబర్ 1 : మిషన్ భగీరథ నీరందక నాగుల్వాయి గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై గత నెల 27న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో ‘చెలిమెల నీరే దిక్కు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు మిషన్ భగీరథ అధికారులు స్పందిస్తూ అక్కడ ఎలాంటి సమస్య లేదని ఖండించారు. ఈ మేరకు మరోసారి గ్రామాన్ని సందర్శించిన ‘నమస్తే’ బృందం అక్కడి ఇబ్బందులను వివరిస్తూ గత నెల 31న ‘తాగు నీటి గోస తీరేదెలా’ శీర్షికన కథనం ప్రచురించింది.
దీంతో మిషన్ భగరథ డీఈ పృద్వీరాజ్, ఏఈ అభిలాశ్, పంచాయతీరాజ్ కార్యదర్శి తుకారాం తదితర సిబ్బంది శనివారం గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు వారి ఆదేశాలతో ఆదివారం గ్రామ పంచాయతీ సిబ్బంది పలుచోట్ల పైపులైన్‌కు మరమ్మతులు చేసింది. రెండు రోజుల్లో తాగు నీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ‘నమస్తే తెలంగాణ’కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.