బెల్లంపల్లి, ఏప్రిల్ 4 : బెల్లంపల్లి బల్దియాలో అధికారులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందన్న సాకుతో రోడ్డు పక్కనున్న తోపుడుబండ్లు, చిన్న దుకాణాలను తొలగించిన మున్సిపల్ సిబ్బంది, ని బంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తులను మాత్ర పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతనెల 19న ప ట్టణంలోని బజార్ ఏరియాలో కాంటా చౌర స్తా నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ స్థలాలు, మురుగు కాలువలపై ఏర్పాటు చేసి దుకాణాలు, తోపుడు బండ్లు, ఇతర సామగ్రిని మున్సిపల్ అధికారులు తొలగించిన విషయం విదితమే.
కలెక్టర్ ఆదేశాలతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలు తొలగిస్తున్నామని చెప్పిన మున్సిపల్ అధికారులు, ఆ ఒక్కరోజుతోనే సరిపెట్టారు. అదే రో జు మధ్యాహ్నం వరకు తొలగించి, లంచ్ బ్రేక్ తర్వాత స్వస్తి చెప్పారని పట్టణ ప్రజలు మా ట్లాడుకుంటున్నారు. ఆ వైపు బడాబాబుల దు కాణాలు, భవంతులు ఉన్నాయనే ఉద్దేశంతోనే తొలగించలేదని జోరుగా ప్రచారం సాగుతున్నది. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రకటించిన కమిషనర్ ఆ రోజు నుంచి ఆ వైపు కన్నెత్తి చూ డకపోవడం విమర్శలకు తావిస్తున్నది. చిరువ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు బడా వ్యాపారుల జోలికి ఎందుకు వెళ్లడంలేదని ప్రజలు మండిపడుతున్నారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులు ఉన్నాయి. ఇందులో కాల్టెక్స్ ఏరియాలోని రెండు వార్డుల్లో మాత్రమే ఇళ్లు, భవనాల నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు ఉన్నాయి. మిగతా వార్డులు సింగరేణి ఆధీనంలో ఉండగా, ప్రస్తుతం రెవెన్యూకు అప్పగించింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు లేవు. ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాలంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. ఈ నిబంధన మున్సిపల్ అధికారులు, వార్డు ప్రజాప్రతినిధులకు వరంలా మారింది. ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిస్తే స్థానిక ప్రజాప్రతినిధి మున్సిపల్ అధికారులకు సమాచారం ఇస్తాడు.. ఆపై ఆ నిర్మాణాన్ని అడ్డుకుంటారు.. దీంతో సదరు యజమాని ప్రజాప్రతినిధిని మచ్చిక చేసుకుంటే నిర్మాణం చేసుకోవచ్చు.. లేదంటే ప్రతిరోజూ మున్సిపల్ సిబ్బం ది నిర్మాణాన్ని అడ్డుకుంటూ పనిముట్లను స్వాధీనం చేసుకుంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ. లక్షలతో పనులు ప్రారంభించిన యజమాని ఇక చేసేదేమీ లేక ప్రజాప్రతినిధిని కలిసి గుడ్విల్ చెల్లించుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ విధంగా అనేక భవనాలు అనుమతులు లేకుండా వెలిశాయి. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోకపోవడం, మధ్యవర్తులకు నజరానాలు చెల్లించడంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఒక్కో వార్డులో ఫిల్లర్కు రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు లావాదేవీలు నడుస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. బెల్లంపల్లిలో ఎక్కడైనా నిరుపేద వ్యక్తి చిన్న ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై ఉక్కుపాదం మోపే మున్సిపల్ అధికారులకు.. బహుళ అంతస్తులు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్న ఇంటి ని, దుకాణాన్ని కూల్చి వేసి బహుళ అంతస్తు నిర్మించుకున్న యజమాని మాత్రం ఆస్తి పన్ను.. ఆ చిన్న ఇల్లు, దుకాణం పేరిటే చెల్లిస్తుండడంతో యేటా లక్షల్లో ఆదాయం కోల్పోవాల్సి వస్తున్నది. సదరు మున్సిపల్ సిబ్బంది యజమానులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టణంలో పార్కింగ్ సమస్య ఉందని అధికారులు నా పండ్ల దుకాణాన్ని తొలగించిన్రు. తోపుడు బండిపై ఉన్న తడకలు మున్సిపల్ కార్యాలయానికి తీసుకపోయి న్రు. పండ్ల వ్యాపారంపై బతికే మాపై అధికారులు ప్రతాపం చూపిస్తున్నరు. కమిషనర్లు కొత్తగా వచ్చినప్పుడు మా లాంటి పేదోళ్ల తాత్కాలిక దుకాణాలను తొలగిస్తరు. బడాబాబుల దుకాణాల వైపు మాత్రం కన్నెత్తి చూడరు. కాంటా చౌరస్తా నుంచి బజార్ ఏరియా వరకు కొన్ని దుకాణాలను మాత్రమే తొలగించిన్రు. పెద్దోళ్ల దుకాణాల జోలికి మాత్రం పోలేదు. ఇక్కడంతా పలుకుబడి ఉన్నోళ్లదే నడుస్తోంది.
– అబ్బాస్
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా నుంచి బజార్ ఏరియా వరకు పార్కింగ్ స్థలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపునకు శ్రీకారం చుట్టాం. ఇటీవల రోడ్డుపై నడవడానికి స్థలం లేక ఓ అమ్మాయికి ప్రమాదం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నందున ఈ ప్రక్రియపై దృష్టి పెట్టలేకపోతున్నాం. రోడ్ల పై ఎవ్వరూ తోపుడు బండ్లు పెట్టకూడదు. ప్రమాదాలు జరిగితే బాధ్యులు అవుతారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే తొలగింపు ప్రక్రియ ప్రారంభిస్తాం.
– గోపు మల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్