భూ భారతి వెబ్‌సైట్‌లోని లొసగులను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గుంట, రెండు గుంటల చొప్పున ఇల్లీగల్ లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇది అతి పెద్ద ఆదాయ మార్గంగా మారగా, ఇదే అదనుగా కొందరు తహసీల్దార్లు సైతం సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మాటున అనధికారిక లే-అవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తూ, అక్రమార్కులకు కొమ్ముకాస్తుం డటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీటీసీపీ అనుమతులు తీసుకొని, ప్రభుత్వ నిబంధనల మేరా లేఅవుట్ వేసే వాళ్లు సైతం ఈ వ్యవహారం చూసి విస్తుపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా జైపూర్ మండలంలో అత్యధికంగా ఈ తరహా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
– మంచిర్యాల, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
జిల్లాలోని జైపూర్ సహా హజీపూర్, లక్షెట్టిపేట, భీమారం, మందమర్రి మండలాలతో పాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ చుట్టుపక్కల ఇల్లీగల్ లే అవుట్ ప్లాటింగ్ దందా మూడు పూలు.. ఆరు కాయలుగా సాగుతున్నది. తాజాగా కలెక్టర్ కుమార్ దీపక్ సైతం ఈ వ్యవహారాన్ని గుర్తించారు.
జిల్లాలో చాలా మంది తహసీల్దార్లు గుంట, రెండు గుంటల చొప్పున అనధికారిక లేఅవుట్లలో భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు దృష్టికి వచ్చిందని, ఈ మేరకు జిల్లాలోని తహసీల్దార్లు చిన్న పరిణామాలు 5 గుంటల్లోపు భూములు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అవసరమైన అన్ని పత్రాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. ప్రతి నెలా 5 గుంటల కంటే తక్కువ మొత్తంలో చేసిన రిజిస్ట్రేషన్ వివరాలను తప్పనిసరిగా కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
డీటీసీపీ లేఅవుట్ కాకుండా ఏర్పాటు చేసే అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ అవుతుండటంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. భూ భారతి వెబ్సైట్లో గుంట, రెండు గుంటల వ్యవసా య భూమి సైతం వేరే వారి పేరు మీదకు బదాలాయింపు అవుతున్నాయి. చట్టంలో చెప్పలేదు.. వైబ్సైట్లో అడ్డులేదు.. గుంట, రెండు గుంటలు చేయకూడదని ఎక్కడుందని దబాయిస్తూ అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు రెవెన్యూ అధికారులు, వెంచర్ల నిర్వాహకులు, డెవలపర్లు రెచ్చిపోతున్నారు. ఇలా కొందరి స్వార్థం కోసం చేస్తున్న పనితో రానున్న రోజుల్లో నాన్ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. ఇల్లీగల్ లే అవుట్లలో రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్, వాటర్ లైన్లు చూపిస్తున్నారు.
ఇక్కడ కొస మెరుపు ఏమిటంటే రోడ్లు, డ్రైనేజీలుకు చూపిస్తున్న భూమి పట్టాదారు పేరుపైనే ఉంటుంది. కొన్న ప్లాట్ ఒక్కటే కస్టమర్ పేరు మీదకు మారుతుందే తప్ప.. రోడ్లకు వదిలేసి భూమి పట్టాదారు పేరుమీదే ఉంటుంది. కొందరు డెవలపర్లు నాన్-అవుట్‌ను డెవలప్ చేసే క్రమంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన భూమిని రైతుల పేరుపైనే ఉంచి, నేరుగా కస్టమర్లకు బదలాయిస్తున్నారు. దీంతో సదరు లేఅవుట్లో రోడ్లుగా చూపించిన భూమి పట్టాదారు పేరుపైనే ఉండిపోతున్నది.
నాన్ అవుట్ అవ్వడంతో గవర్నమెంట్‌కు అది బదిలీ కావడం లేదు. రానున్న రోజుల్లో సదరు యాజమాని రోడ్లు ఉన్న భూమి తనదే అని ఎదురుతిరిగితే దానికి బాధ్యులు ఎవరు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరో సమస్య ఏమిటంటే.. నాన్ లేవుట్‌లో రోడ్లు రిజిస్ట్రేషన్ సమయంలో చూపించరు. డాక్యుమెంట్లో ఇన్ని గుంటలు అని రాస్తారు.. తప్ప రోడ్డు ఉండదు. దీంతో రోడ్లుగా చూపించిన భూమి సైతం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాలున్నాయి. ఎకరంలో నిబంధనల ప్రకారం రోడ్లు తీసివేయగా వచ్చే ప్లాట్లు 16 నుంచి 18 ఉంటాయి. కానీ, నాన్ లే అవుట్లలో మొత్తం భూమిని గుంటల రూపంలో అమ్మే అవకాశాలున్నాయి.
ఇవన్నీ కూడా భవిష్యత్తులో కస్టమర్లకు ఇబ్బందిగా మారడడంతో పాటు భూముల పంచాయతీలు, గొడవలకు దారి తీయొచ్చు. అదే జరిగితే రానున్న రోజుల్లో అహింస సైత చలరేగవచ్చని.. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఇబ్బందులు వస్తాయని తెలిసీ భూ భారతి వెబ్‌సైట్‌లోని లొసగులను అడ్డం పెట్టుకొని అధికారులు ఇలా చిన్న మొత్తాల్లో భూముల రిజిస్ట్రేషన్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలా చేసే నాన్ లేఅవుట్లతో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సైతం ఆదాయాన్ని కొల్పోతున్నాయి. పైపెచ్చు రానున్న రోజుల్లో ఆయా వెంచర్లలో ఇండ్లు కట్టుకుంటే రోడ్ల నిర్వహణ, డ్రైనేజీలు, విద్యుద్దీపాలు, తాగునీటి సరఫరా కోసం సర్కారు సొమ్మును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆదాయం కోల్పోవడంతో పాటు కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడనున్నది.
కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయకుండా జిల్లాలోని కొందరు రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా నాన్ అవుట్లలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. జైపూర్ మండలంలో ఒక్క టేకుమట్ల గ్రామాన్నే ఉదాహరణగా తీసుకుంటే టేకుమట్ల గ్రామంలో 175 సర్వే నంబర్లో దాదాపు మూడు ఎకరాల 18 గుంటలు.. ఇలా గుంటల చొప్పున ఇల్లీగల్ లేఅవుట్ వేసి విక్రయించారు. ఇదే గ్రామంలో 718, 720 సర్వే నంబర్లలో 15 ఎకరాల విస్తీర్ణంలో నాన్ అవుట్ ప్లాటింగ్ చేసి విక్రయిస్తున్నారు. సర్వే నంబర్ 716లో ఎకరంన్నర విస్తీర్ణంలోనూ ప్లాటింగ్ చేసి రిజిస్ట్రేషన్లు చేయించారు. ఇదే మండలంలో నర్వా, ఇందారం, రాసూల్‌పల్లి, శెట్టిపల్లి ఇలా అనేక గ్రామాల్లో ఇల్లీగల్ లేఅవుట్ల దందా సాగుతున్నది.
ఇదే తరహాలో మందమర్రి, భీమారం, హజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో ఇల్లీగల్ వెంచర్లను ప్లాటింగ్ చేసి విక్రయిస్తున్నారు. ఎంతసేపూ తాత్కాలిక ఆదేశాలకే పరిమితం అవుతున్న అధికారులు.. ఇప్పటి దాకా జరిగిన రిజిస్ట్రేషన్లు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం, క్షేత్రస్థాయిలో పర్యటించి నాన్‌లేఅవుట్‌ను తొలగించకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో ఆదేశాలిచ్చిన కలెక్టర్ స్వయంగా లేదా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇల్లీగల్ వెంచర్లపై ఉక్కుపాదం మోపాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ఉన్నతాధికారుల ఆదేశాలతోనైనా జిల్లాలో నాన్ లే అవుట్ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయా.. లేదా అన్నది తేలాల్సి ఉంది.