మంచిర్యాల, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రస్థాయిలో గవర్నర్, జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగే ఏకైక స్వచ్ఛంద సంస్థ రెడ్‌క్రాస్ సొసైటీ. అలాంటి సొసైటీలో మంచిర్యాలశాఖ కార్యవర్గాన్ని ఎన్నుకోవడంలోనూ రాజకీయ చోక్యం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. 2008లో ఆవిర్భవించిన ఈ సొసైటీలో మంచిర్యాల నుంచి 4367 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. మూడేళ్ల పదవీ కాలానికిగాను నేడు (మా ర్చి 3న) ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. ఈ మేరకు సహకార శాఖ ఎన్నికల నోటిఫికేషన్ సైతం ఇచ్చింది. నామినేషన్ల విత్ డ్రా అనంతరం ఫిబ్రవరి 24న పోటీలో ఉన్న 32మందికి ఎన్నికల గుర్తులు సైతం కేటాయించారు.
ఇక ఎన్నికలే తరువాయి అనుకుంటున్న తరుణంలో 24వ తేదీన సొసైటీ పూర్వపు అధ్యక్షులు, ఇతర కార్యవర్గం నుంచి పోటీలో ఉన్న 32 మందికి ఫోన్లు వచ్చాయి. ‘మేం ఎమ్మెల్యే పీఎస్సార్ ఇంట్లో ఉన్నాం. మీ రంతా వస్తే మాట్లాడుకుందాం’ అని చెప్పారు. అక్కడికి వెళ్లాక.. ‘ఎన్నికలేం లేవు. ఎవరైతే సేవాభావంతో పని చేస్తున్నారో.. అలాంటి 15 మందితో మేమే కార్యవర్గం ఏర్పాటు చేస్తాం. మీ సమక్షంలో వారిని ఎంపిక చేస్తాం. అందుకు మీరంతా ఒప్పుకోవాలి. ఇప్పుడు సంతకాలు చేయండి. అందరం కలెక్టర్‌ను కలిసి కమిటీ ఏకగ్రీవం చేయాలనుకుంటున్న నిర్ణయాన్ని చెబుతాం’ అంటూ 32 మంది దగ్గర సంతకాలు తీసుకున్నారు. ఎమ్మెల్యే సార్ వచ్చాక మీ అందరినీ పిలిచి మాట్లాడుతారంటూ చెప్పారు.
సీన్ కట్ చేస్తే.. 32 మంది సంతకాలు చేసిన పేపర్లతో వెళ్లి కొంత మంది మాత్రమే కలెక్టర్‌ను కలిశారు. ఎన్నికలు ఖర్చుతో కూడుకున్న పని.. అంతా కలిసి ఏకగ్రీవం చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సైతం ఇచ్చారు. దీంతో కలెక్టర్ ఈ నెల 3న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసి, 10న నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. కానీ 32 మందిని సంప్రదించకుండా ఓ 15 మంది మాత్రమే శుక్రవారం గుట్టుచప్పుడు.. కాకుండా హడావుడిగా వెళ్లి మరోసారి నామినేషన్లు వేసినట్లు సమాచారం. దీంతో మిగిలిన వారు ఏం జరుగుతుందో తెలియడం లేదని, సంతకాలు తీసుకొని తమను మోసం చేశారంటూ మండిపడుతున్నారు.
తమకు తెలియకుండానే 15 మంది వారిలో వారే అనేసుకొని ఏకగ్రీవం అంటే ఎలా చెల్లుతుందని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే పీఎస్సార్ పేరు చెప్పడంతో ఏం చేయాలే తెలియక మిన్నకుండి పోతున్నామంటున్నారు. ఈ విషయాన్ని అడిగేందుకు తమను పీఎస్సార్ ఇంటికి పిలిచి మాట్లాడిన మహేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సత్యపాల్రెడ్డిలకు ఫోన్ చేస్తే స్పందించడం లేదంటున్నారు. సేవా భావంతో పని చేయాల్సిన స్వచ్ఛంద సంస్థలో ఇన్ని రాజకీయ ‘హస్తాలు’ సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నామినేషన్లు వేసిన 15 మందిలో కొందరు సంవత్సరానికి ఒక్కసారే రక్తదానం చేసేవారు ఉన్నారని, ఇప్పటికైనా కలెక్టర్, ఎమ్మెల్యే పోటీలో ఉన్న 32 మందిని పిలిచి అభిప్రాయాలు సేకరిస్తే అసలు విషయం తెలుస్తుందని చెబుతున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పి ఇలాంటి పనులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.