మంచిర్యాల ఏసీసీ, మే 19 : మంచిర్యాల జిల్లాలో ఆర్ఎంపీ, పీఎంపీలు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జ్వరమో, నొప్పో అని పోతే హైడోస్ ఇంజక్షన్లు, యాంటిబయోటిక్ మందులు ఇస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. మరో వైపు పెద్ద రోగం వస్తే వారికి తెలిసిన ప్రైవేటు ఆసుపత్రికి రెఫర్ చేస్తూ కమిషన్ల రూపంలో డబ్బులు దోచుకుంటున్నారు.
తమ పరిమితికి మించి వైద్యం చేస్తున్నారనే సమాచారం మేరకు కలెక్టర్, వైద్యారోగ్యశాఖ అధికారులు పలు మార్లు సమావేశాలు ఏర్పాటు చేసినా తీరు మారడం లేదు. ఈ మధ్య కాలంలో ఎన్ఎంసీ, టీఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించి 20 మందికి పైగా ఆర్ఎంపీలపై నేషనల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కేసుల నమోదుకు సిఫార్సు చేశారు. గత నెలలో లక్షెట్టిపేటకు చెందిన ముగ్గురు ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం అందిస్తున్నారని తెలియడంతో వారిపై అక్కడి స్థానిక పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేశారు.
పుట్టగొడుగుల్లా క్లీనిక్లు
గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ఏదైనా రోగమొస్తే మొదటగా గుర్తొచ్చేది ఆర్ఎంపీలే. ఇలా రోగులు వస్తుండడంతో క్లీనిక్లు గల్లీకొకటి చొప్పున పుట్టుకొస్తున్నాయి. రెండు లేదా మూడు గదులను అద్దెకు తీసుకుని, మంచి ఫర్నిచర్ పెట్టి మెరుగైన వైద్యం అందిస్తామనే స్థాయిలో ఆకర్షిస్తున్నారు. ఆర్ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలి. తీవ్రతను బట్టి పీహెచ్సీ, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి. కానీ.. ప్రిస్కిప్షన్ పెట్టుకుని ల్యాబ్ టెస్టులు, మందులు, స్కానింగ్లు చేస్తున్నారు. ఫ్లూయిడ్స్ అమర్చి పరిమితికి మించి యాంటిబయోటిక్స్ ఇంజక్షన్లు ఇస్తూ రోగాన్ని తగ్గిస్తున్నారు.
20 మందిపై కేసు
పట్టణాలు, గ్రామాల్లో అర్హతకు మించి ఆర్ఎంపీ, పీఎంపీలు వైద్యం అందిస్తున్నారనే పూర్తి సమాచారంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ), తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు(టీఎస్ఎంసీ) గ్రూపులుగా టీఎస్ఎంసీ మెంబర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎథికల్ అండ్ యాంటీ క్వాకర్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, స్టేట్ చైర్మన్ కిరణ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో గత మార్చిలో మంచిర్యాలలో ఇద్దరు, లక్షెట్టిపేటలో ఇద్దరు ఆర్ఎంపీలను గుర్తించి కేసులు నమోదు చేయించారు. తాజాగా జిల్లా కేంద్రంలో ముగ్గురు, నస్పూర్లో 11మంది, మం దమర్రిలో ముగ్గురు, తాండూర్లో ము గ్గురు మొత్తం 20 మంది ఆర్ఎంపీలపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కేసుల నమోదుకు సిఫార్సు చేశారు.
నిరంతరం తనిఖీలు చేస్తాం..
ఆర్ఎంపీ, పీఎంపీల వ్యవస్థను దారిలోకి తీసుకొస్తాం. కొంద రు ఆర్ఎంపీలు హైడోస్ మందులు ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలు వస్తాయి. జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. ఇకనైనా మారి స్థాయికి మంచి వైద్యం అందించకుండా ప్రథమ చికిత్స మాత్రమే అందించాలి.
– డాక్టర్ శ్రీనివాస్,టీఎంసీఎస్ సభ్యుడు, మంచిర్యాల.