మంచిర్యాల, జూలై 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత త్వరగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో ఆగస్టులో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందంటూ తెగ ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడిచింది. దీంతో ఆశావహులు అప్రమత్తమయ్యారు.
ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూసుకుంటూ, ఎలాగైనా సర్పంచ్ లేదా వార్డు మెంబర్ టికెట్లు దక్కించుకోవాలనే పట్టుదలతో భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆగస్టులో ఎన్నికలు ఉండకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2019లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే సమయంలో సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది.
ముందు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. కాకపోతే అప్పటికప్పుడు బీసీ కమిషన్ ఈ ప్రక్రియ పూర్తి చేయలేదన్న ఉద్దేశంతో మినహాయింపు ఇచ్చి, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ ఖరారును తప్పనిసరి చేసింది. బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి నియమించిన కమిషన్ ముందు ట్రిపుల్ టెస్టు చేసి నివేదిక ఇవ్వాలి. అదయ్యాకే బీసీ రిజర్వేషన్లు ఫైనల్ చేసి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ.. ఇప్పటి వరకు బీసీ కమిషన్ ఎలాంటి పనులు చేయపట్టలేదని తెలుస్తున్నది. ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియ మొదలుపెట్టినా అంతా పూర్తయి, ఎన్నికల దాకా రావాలంటే కనీసం రెండు నెలల సమయం పట్టనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయనే ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లోక్సభ ఓటరు జాబితా ప్రామాణికంపై వ్యతిరేకత
స్థానిక సంస్థల ఎన్నికలకు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో వినియోగించిన ఓటర్ల జాబితాను ప్రాతిపాదికగా తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని లిస్టు ఇవ్వాలని కోరింది. తెలంగాణతోపాటు మరో ఐదు రాష్ర్టాలకు ఈ జాబితా ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. ఈ మేరకు కేంద్రం నుంచి అతి త్వరలోనే ఎన్నికల జాబితా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా.. ఈ ఓటరు జాబితాను ప్రతిపాదికగా తీసుకుని బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే బీసీ సంఘాలు చెప్తున్నాయి.
జనాభా ప్రతిపాదికన తీసుకునే రిజర్వేషన్లు ఫైనల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొండికేసి ముందుకెళ్తే న్యాయపరమైన చిక్కులు తప్పవనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం కన్నా.. బీసీ కమిషన్ నివేదిక ఇచ్చాకే రిజర్వేషన్లు ఖరారు చేసుకుని న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందుకెళ్తేనే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొదలైన సందడి
ఆగస్టులో ఎన్నికలంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో గ్రామాల్లో సర్పంచ్ పదవుల సందడి మొదలైంది. ఆశావహులు అన్ని రకాల అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఏం చేయాలా అని ఆలోచనలు, చర్చలు గ్రామాల్లో జోరందుకున్నాయి. కొందరైతే చేస్తున్న ఉద్యోగాలు మానేసి మరీ ఎన్నికల కోసమంటూ ఊర్లకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1509 గ్రామపంచాయతీలు ఉండగా, 12,703 వార్డులు ఉన్నాయి. దీంతో అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలుపుకుని వేలాది మంది మంది స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉండడంతో ఆశావహులు ఎక్కువయ్యారు. గ్రామంలో సర్పంచ్ టికెట్ బీసీలకు ఇస్తే ఒక్కో గ్రామంలో ఐదు నుంచి పది మంది వరకు పోటీలో నిలుబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇది రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారనుంది. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ ఇబ్బందులు రానున్నాయి. ఇటీవల పార్టీలో చేరిన వారు, ఎప్పటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారికి మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది. టికెట్ దక్కని నాయకుల అసమ్మతితో కొత్త చిక్కులు వచ్చిపడనున్నాయి. వీటన్నింటినీ సరి చేసుకునేందుకు చాలా సమయం అవసరం అవుతుంది.
అందుకే ముందస్తు ఎత్తుగడలో భాగంగానే స్థానిక ఎన్నికలంటూ అధికార పార్టీ ప్రచారానికి తెరలేపిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్న బీఆర్ఎస్ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా దూసుకుపోయేందుకు సిద్ధం అవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల ప్రక్రియ ఎటుపోయి ఎటు తిరుగుతుందో చూడాలి మరి.
కులగణన చేశాకే ఎన్నికలు నిర్వహించాలి..
రాష్ట్ర ప్రబుత్వం బీసీ కుల గణన చేపట్టాకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలి. జనాభాలో సగం ఉన్న బీసీలు రాజకీయంగా అనాధిగా అణగదొక్క బడుతున్నాయి. పదువుల కేటాయింపుల్లో తీరని అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలి. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. అవసరమైన ఉద్యమాలు చేసేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారు.
– చంద్రమోహన్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మంచిర్యాల.