ఆదిలాబాద్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను రియల్ వ్యాపారులు, అక్రమార్కులు, అధికారులు కలిసి కొల్లగొడుతున్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్, ఇతర ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడానికి యత్నించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాడు రోజుల కిందట రణధీవనగర్లోని స్టేట్‌బ్యాంకులో తాకట్టు, ఎన్ఫోర్స్మెంట్ ఆధీనంలో ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే 2.09 ఎకరాల భూమిని బడా రియల్ వ్యాపారులు రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పోలీసులు, రియల్ వ్యాపారులతోపాటు పది మందిపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కొందరు రియల్ వ్యాపారులు, భూ కబ్జాదారులకు ప్రభుత్వ భూములు, వివాదాస్పద స్థలాలతోపాటు ఇతర స్థలాలపై మంచి అవగాహన ఉంది. బడా రియల్ వ్యాపారులకు చెందిన మనుషులు రోజు రెవెన్యూ, సర్వే కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ పనులు చక్కబెడుతుంటారు. అధికారులు, సిబ్బంది సహకారంతో వివిధ భూములకు చెందిన వివరాలు తీసుకుంటారు. రణధీవనగర్లో 2.09 ఎకరాలు ఎన్ఫోర్స్మెంట్ ఆధీనంలో ఉండగా రియల్ వ్యాపారులు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం సర్వే అధికారుల సహకారంతో సప్లిమెంటరి సేత్వార్‌ను తయారు చేయించుకున్నారు.
భూముల వివరాలు, హద్దులు తెలియజేసే రికార్డులను సేత్వారీలు అంటారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి సమస్యలు ఉంటే 1950 కంటే ముందు నుంచి సర్వే అండ్ ల్యాండ్ శాఖ వద్ద ఉన్న సేత్వారీ రికార్డులు ఆధారంగా పరిష్కరించి తిరిగి తయారు చేసే విధానాన్ని సప్లిమెంటరీ సేత్వారీగా పరిగణిస్తారు. రియల్ వ్యాపారులకు సహకరించడానికి సర్వే అధికారులు ఈ రికార్డులను తారుమారు చేసినట్లు తెలుస్తున్నది. ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో రిజస్ట్రేషన్ అయిన తర్వాత భూమికి సంబంధించిన సప్లిమెంటరీ సేత్వారీని సర్వే అధికారులు తయారు చేశారు. ఈ కేసుకు సంబంధించి సప్లిమెంటరీ సేత్వారీ ఇచ్చిన కబ్జాదారులకు సహకరించిన వారిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.