నిర్మల్ అర్బన్, డిసెంబర్ 24 : ‘స్వామి శరణం.. అయ్యప్ప శరణం.. స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ భక్తుల కోర్కెలను తీర్చే ప్రసిద్ధి ఆలయంగా హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయం విరాజిల్లుతున్నది. ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయినందున రజతోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ధర్మకర్త అల్లోల మురళీధర్ రెడ్డి-వినోదమ్మ దంపతులు ఆలయాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఆయా గ్రామాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటూ నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప దీక్షా పరుల శరణుగోషతో ఆలయం మార్మోగుతున్నది. ప్రతి ఏటా వేలాది మంది భక్తులు అయ్యప్ప మాలధారణ స్వీకరిస్తూ స్వామి వారిని కొలుస్తున్నారు.
నేటి నుంచి మూడు రోజుల పాటు వేడుకలు
ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తవుతున్నందున ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రజతోత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉదయం 1008 మోదుకతో లక్ష్మీ గణపతి హోమం, సాయంత్రం 6.30 గంటలకు లక్ష పుష్పార్చన, గురువులు బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మతో ఆధ్యాత్మిక ప్రవచనాలుంటాయి. రెండో రోజు సోమవారం సుబ్రహ్మణ్య స్వామి హోమం, కుంకుమార్చన, గురువులు గరికపాటి గురజాడ ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పనున్నారు. మూడో రోజు అయ్యప్ప స్వాములకు సహస్రగట మంటపారాధన, అభిషేకం, ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి, కుంభాభిషేకం, హారతి, మంత్రపుష్పం, సహస్త్ర కలశ కుంభాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు బ్రహ్మశ్రీ శబరిమల అయ్యప్ప స్వామి ప్రధాన అర్చకులు, అయ్యప్ప దివ్యపదునెట్టాంబడి పూజా కార్యక్రమాలుంటాయి. 28న వళ్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేడుకలకు హాజరైన భక్తులందరికీ ప్రతిరోజూ మద్యాహ్నం భిక్ష, రాత్రికి అల్పహారం అందించనున్నారు.
హాజరుకానున్న మంత్రి, ప్రముఖులు..
రజతోత్సవాల సందర్భంగా ఆయ్యప్ప ఆలయంలో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీధర్ రెడ్డి, ఖానాపూర్, ముథోల్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్ రెడ్డితో పాటు జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి ఏర్పాట్లు చేపట్టారు.