మంచిర్యాల, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం.. సర్కారు రాగానే కొత్త రేషన్ కార్డులిచ్చాం..” అంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నిబంధనలు అనుసరించి రేషన్ కార్డులకు కోత పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలో నిజాయితీ గల పౌరుడిగా నిలబడాలంటే స్వచ్ఛందంగా ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేసుకోవాలంటూ ప్రచారం చేస్తున్నది. ఇదీ ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్తున్నది. దీంతో చాలా మంది నెలకు తక్కువ జీతంతో కాలం వెళ్లదీస్తున్నప్పటికీ ఐటీఆర్ చూపించుకుంటున్నారు. స్వచ్ఛందంగా తమ ఆదాయ వివరాలు సమర్పిస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి, కేంద్ర ప్రభుత్వం గట్టి దెబ్బ కొట్టబోతున్నది. ఐటీఆర్ సబ్మిట్ చేసిన వారికి రేషన్ కార్డు ఉందా? లేదా? అన్నదానిపై క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తున్నది. అధిక ఆదాయంతో పన్ను కట్టే వారికి రేషన్ కార్డు అవసరం లేదని చెప్పి కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఐటీఆర్ కట్టేవారితోపాటు ఐదెకరాలకంటే ఎక్కువ భూమి ఉండి రేషన్ కార్డు ఉన్న వారిని గుర్తించాలని, దీంతోపాటు ఐదెకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండి వేరే ఏమైనా సంక్షేమ పథకాల కింద లబ్ధిపొందుతున్నారా? అని సర్వే చేసి వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈ మేరకు సివిల్ సప్లయ్ అధికారులతోపాటు రెవెన్యూ అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఈ నిబంధనలు సాకుగా చూసి రాష్ట్రవ్యాప్తంగా ఐటీఆర్ కడుతున్న నిజాయితీపరులు, వ్యవసాయాన్నే నమ్ముకొని రెక్కల కష్టం మీద బతికే రైతుల రేషన్ కార్డులు తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
సాధారణంగా ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ రెండు వర్గాల ప్రజలు దాఖలు చేస్తారు. పన్ను పరిధిలోకి వచ్చే వారు ఒకరైతే, మరో వర్గంలో పన్ను పరిధిలోకి రాని సామాన్యులు ఉంటారు. ట్యాక్స్ పరిధిలోకి రానప్పటికీ గృహ రుణాలు, పర్సనల్ లోన్స్, ఇతర ఆర్థిక అవసరాలకు ఐటీఆర్ ఉపకరిస్తుందని ఆశ పడి.. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేస్తారు. ఐటీఆర్ సబ్మిట్ చేస్తున్నారనే ఏకైక కారణాన్ని చూపి అలాంటి సామాన్య కుటుంబాలను ఆదాయం కలిగిన కుటుం బాలుగా చూపిస్తే, ఎనలేని నష్టం వాటిల్లే ఆస్కారం ఉంది. పెరిగిన ఖర్చులతో భార్యాభర్తలు ఇరువురు కష్టపడితే గానీ మధ్య తరగతి కుటుంబాల జీవనం ముందుకు సాగడం లేదు. పిల్లల చదువులు, వై ద్య ఖర్చులతో పైసా మిగలడం లేదు. అనుకోని ఘటనలతో ఉన్నట్టుం డి ఉద్యోగం ఊడితే సదరు కుటుంబం ఒక్కసారిగా బీపీఎల్ (దారిద్య్రరేఖకు దిగువకు) వెళ్లిపోతుంది. ఇలాంటి కుటుంబాలు భ విష్యత్‌లో లోన్లు తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలనో, ఇతర అవసరాలు తీర్చుకోవాలనో, వ్యాపారం చేసుకోవాలన్న ముం దస్తు వ్యూహ్యంతోనే ఐటీఆర్ చూపిస్తున్నారు. అలాంటి వారిపై కేం ద్రంలోని బీజేపీ సర్కారు కొరడా ఝులిపిస్తున్నది. 12 ఏళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వంలో రూ.వేల కోట్లు కొల్లగొట్టి బడా వ్యాపారులు ఈ దేశాన్ని వదిలి పరారయ్యారు. వారిపై ఎలాంటి చర్యలూ లేవు. బు క్కెడు రేషన్ బియ్యం తీసుకునే సామాన్య కుటుంబాలపై నిబంధనల సాకుతో విరుచుకు పడడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వంత పాడుతోన్న రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుపై జనాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రేషన్ కార్డులు ఇచ్చినట్లే ఇచ్చి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐటీఆర్ చూపిస్తున్న, ఐదెకరాలకంటే ఎక్కువ భూమి ఉండి, రేషన్‌కార్డు ఉన్న వాళ్ల వివరాలతోపాటు వ్యవసాయ భూములు ఉండి సంక్షేమ పథకాలు పొందుతున్న వారి వివరాలు సేకరించాలని ఇప్పటికే సివిల్ సప్లయ్, రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు చెప్తున్నారు. దీనిపై సంబంధింత శాఖ అధికారులను సంప్రదించగా.. ఆదేశాలు వచ్చిన విషయం వాస్తవమంటున్నారు. క్షేత్రస్థాయిలో సర్వేచేసి వివరాలు సేకరించాల్సి ఉంటుందని చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాలతో కుదరడం లేదని, ఉన్నతాధికారుల సూచనల మేరకు త్వరలో సర్వే చేసే అవకాశాలున్నాయంటున్నారు. అదే జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వేలాది రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశాలున్నాయి.
