వేమనపల్లి/ఫర్టిలైజర్‌సిటీ, జూన్ 5: వేమనపల్లి సమీపంలోని ప్రాణహిత నది ఫెర్రీ పాయింట్ వద్ద బుధవారం ఉదయం మహారాష్ట్ర నుంచి వేమనపల్లికి ఎడ్లబండిలో తరలిస్తున్న 2.05 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లికి నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయనే సమాచారం మేరకు నీల్వాయి పోలీసులు, వ్యవసాయాధికారులు నిఘా ఉంచినట్లు తెలిపారు.
మహారాష్ట్రలోని సిరొంచ తాలూకా కోటపల్లికి చెందిన కోల సాయికిరణ్ ఎడ్లబండ్లిలో నకిలీ విత్తనాలతో వస్తుండగా పట్టుకున్నామన్నారు. పోలీసులను చూసి కోల రమేశ్, సుమిత్, జంగ సంపత్ పరారయ్యారని, నకిలీ విత్తనాల విలువ రూ.6.75 లక్షలు ఉంటుందన్నారు. నకిలీ విత్తనాలు, ఎడ్లబండి, ఎద్దులను స్వాధీనం చేసుకుని కోల సాయికిరణ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, కానిస్టేబుల్ రాజేందర్, రాజశేఖర్‌ను సీపీ అభినందించి రివార్డు అందించారు. ఈ సమావేశంలో డీసీపీ అశోక్‌కుమార్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, వ్యవసాయాధికారి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.