ఎదులాపురం, మార్చి1 : ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం నెలవంక కనిపించడంతో ఆదివారం నుంచి అత్యంత కఠినంగా ఉపవాసాలు కొనసాగనున్నాయి. మార్చి 30న శవ్వాల్ నెలవంక కనిపిస్తే.. 31న రంజాన్ పండుగ జరుపుకోనున్నారు. ఈ మాసంలోనే దివ్య ఖురాన్ అవతరించిందని ముస్లింల విశ్వాసం. ఖురాన్లోని 30 అధ్యయాలు ఈ మాసంలోనే పూర్తి చేస్తారు. దీనినే తరావి నమాజ్ అంటారు.
రంజాన్ మాసంలో లభించే ప్రత్యేక వంటకం హలీం. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వరకే పరిమితమైన హలీం దశాబ్ద కాలంగా జిల్లాలోని ముఖ్య పట్టణాలైన మంచిర్యాల, చెన్నూర్, లక్షెట్టిపేట, బెల్లంపెల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ పట్టణాలకు విస్తరించింది. హలీం, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ విక్రయాలకు పెద్ద స్టాళ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. మసీదులను ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించారు.