తాండూర్, అక్టోబర్ 24 : ఇసుక అక్రమంగా రవాణా ( Illegal sand transportation) చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాండూరు మండల ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ (Rally ) నిర్వహిం చారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కల్పన, ఎంపీడీవో శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ యజమానులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిన డీజిల్, డ్రైవర్ వేతనాలను చెల్లిస్తూ ఫైనాన్సు కిస్తీలు కడుతూ తాండూర్ మండలంలో ఇసుక రవాణా చేస్తు జీవిస్తున్నామని తెలిపారు.
నెలలో కేవలం 8 నుంచి 10 ట్రిప్పులు కొడుతూ చాలిచాలని ఆదాయంతో ట్రాక్టర్లను నడిపిస్తున్నామన్నారు. ఇటీవల తెలంగాణా ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లకు తాము నెన్నెల మండలం ఖర్జి వాగు నుంచి తాండూర్ మండలానికి ఇసుక రవాణా చేసున్నామని వివరించారు. తాండూర్ మండలానికి చెందిన కొందరు నాయకులు తమ స్వార్ధం కోసం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రెబ్బెన మండలానికి చెందిన ఇసుకను తెప్పిస్తు కిరాయి , వేతనం తక్కువగా ఇస్తున్నారని ఆరోపించారు. దీంతో ట్రాక్టర్ యజమానులకు జీవోనోపాధి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇండ్లకు సరఫరా చేసున్న కిరాయిని తాండూర్ మండల ప్రజల కోసము మరికొంత తగ్గించడానికి సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. తాండూరు మండలానికి ఇసుకను తీసుకురావడానికి తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. రెబ్బెన మండలానికి చెందిన ట్రాక్టర్లను తాండూర్ మండలములోకి రాకుండా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మండలం ట్రాక్టర్ యజమానులు భాస్కర్ గౌడ్, మామిడాల రాజేశం, పేరా శంకర్, పూదరి అనిల్ కుమార్, ఇడిదినేని లక్ష్మణ్, ముదం అనిల్, సప్ప రాకేష్, చీర్ల అరుణ్, బోయిన కిరణ్, మద్దిబోయిన రంజిత్ కుమార్, మండల ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.