
రెండో రోజూ రైతుబంధు సంబురాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎడ్లబండ్ల ర్యాలీలు
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
రైతువేదికల్లో ఆత్మీయ రైతు సమ్మేళనాలు
విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు
ఆకట్టుకున్న లంబాడీ మహిళల నృత్యాలు
పాల్గొన్న ఎమ్మెల్యేలు, నాయకులు, రైతులు
రైతుబంధు చరిత్రాత్మకం : మంత్రి అల్లోల
బ్రహ్మాండంగా నిర్వహించాలి.. : విప్ సుమన్
ఆదిలాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుబంధు వారోత్సవాలు రెండో రోజైన మంగళవారం ఉత్సాహంగా సాగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఊరూరా ఎడ్ల బండ్ల ర్యాలీలు తీశారు. పంచాయతీలు, బ్యాంకుల ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతువేదికల్లో ఆత్మీయ రైతు సమ్మేళనాలు నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు కొనసాగాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేంద్రంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొనగా.. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని క్యాంపు కార్యాలయంలో విప్ బాల్క సుమన్ సమావేశం నిర్వహించి రైతుబంధును బ్రహ్మాండంగా నిర్వహించాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో రైతులు స్వచ్ఛందంగా పాల్గొనగా.. ప్రజాప్రతినిధులు, నాయకులు సంబురాలు నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు ఊరూరా ఉత్సాహంగా సాగుతున్నాయి. సోమవారం ప్రారంభం కాగా.. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేం ద్రంలో మంగళవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మాత్యులు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఆయన పంచాయతీ కార్యాలయం నుంచి రైతువేదిక వరకు ఎడ్లబండి నడుపుతూ ర్యాలీగా వెళ్లారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముగ్గుల పోటీలను తిలకించారు. లంబాడీ మహిళల నృత్యాలు ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 28న ‘నమస్తే’లో ప్రచురితమైన ‘బంధు వొచ్చే… సంబురం తెచ్చే..’ అనే కథనాన్ని రైతులకు చూపించారు. ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బాసర మండలంలోని కిర్గుల్(బీ) రైతువేదిక.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్(బీ) పంచాయతీ ఆవరణ, ఇంద్రవెల్లి మండలంలోని యూనియన్ బ్యాంకు ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తలమడుగు మండలంలోని రుయ్యాడిలో విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో రైతుబంధు సంబురాలపై విప్ బాల్క సుమన్ సమావేశం నిర్వహించారు. వారోత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవాలని ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యులు, టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. తాండూర్ మండలం చౌటపల్లి పంచాయతీ, దండేపల్లి మండల కేంద్రంతోపాటు మేదరిపేట రైతు వేదిక వద్ద, కన్నెపల్లి మండలంలోని రైతు వేదికలో కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. వేమనపల్లి, నీల్వా యి గ్రామాల్లోని రైతు వేదికల్లో ఆత్మీయ రైతు సమ్మేళనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.