ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లాలో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( Heavy Rains) ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంద్రవెల్లి ( Indravelli ) మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాలకు మండల కేంద్రంలోని ప్రభుద్ధనగర్. భీంనగర్ లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, బట్టలు, ఇతర సామగ్రి పూర్తిగా నీటితో తడిసిపోయ్యాయి.
ఇండ్లలో వరద నీరు చేరిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులతోపాటు, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్ డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్ గ్రామాలను సందర్శించారు. బాధితులను ఇళ్ల నుంచి బయటకు తీశారు. అనంతరం బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసి ఆదుకున్నారు. మండలంలోని ముత్నూర్ త్రివేణి సంగమం(Triveni Sangamam) ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరి, ఉద్రిక్తంగా ప్రవహించడంతో రోడ్డు కోతకు గురై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ త్రివేణి సంఘం ప్రాజెక్టును పరిశీలించి కోతకు గురైన రోడ్డును పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా మండలంలోని వాగులు వంకలు వరదతో పొంగిపొర్లుతున్నాయి. భారీగా వరద నీరు చేరడంతో చెరువులు జల కళను సంతరించు కున్నాయి. మండల అధికారులు నాయకులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రజలను అప్రమత్తం చేశారు. వరద నీరు తగ్గిపోవడంతో కోతకు గురైన రోడ్డు వద్ద వాహనాలు వేసేందుకు దారి చేసి వాహనాలను పంపించారు.