ఆదిలాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది. మంగళవారం కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చాలా రోజుల తర్వాత వర్షం పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సగటు వర్షపాతం 9.3 మిల్లీ మీటర్లు నమోదు కాగా భీంపూర్ మండలంలో 21.3 మిల్లీ మీటర్లు, జైనథ్‌లో 20.3 మి.మీ., భోరజ్‌లో 19 మి.మీ., గాదిగూడలో 15.5 మి.మీ, బేలలో 13.6 మి.మీ., ఆదిలాబాద్ రూరల్‌లో 12.4 మి.మీ., సాత్నాలలో 12.8 మి.మీ., నార్నూర్‌లో 9.2 మి.మీ., ఆదిలాబాద్ అర్బన్‌లో 8.8 మి.మీ., మావలలో 8.8 మి.మీ., ఉట్నూర్‌లో 8.5 మి.మీ., సోనాలలో 8.3 మిల్లీ మీటర్ల వర్షం పడింది.
పంటలకు ప్రాణం
ఆదిలాబాద్ జిల్లాలో జూన్ రెండో వారంలో పడిన వర్షాలతో రైతులు విత్తనాలు వేశారు. ప్రస్తుతం పత్తి, సోయా పంటలు మొలకెత్తి 40 రోజులు అవుతుండగా పెరుగుదల దశలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 రోజులుగా వానలు లేకపోవడంతో పంటల ఎదుగుదలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి పంటకు ఎరువులు వేయాల్సి ఉండగా.. భూమిలో తేమశాతం లేకపోవడంతో వేసే అవకాశం లేకుండా పోయింది. ముసురుతో కూడిన వర్షం ఉదయం నుంచి సాయంత్రం వరకు పడడంతో భూమిలో తేమ శాతం బాగా పెరిగింది. ఈ వానతో రైతులకు ఎరువులు వేసే అవకాశం లభించింది. వానలు లేక పంటలు ఎండిపోతాయనే ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మంగళవారం పడిన వర్షం తమ పంటలకు ప్రాణం పోసిందని రైతులు అంటున్నారు. ముసురుతో కూడిన వర్షం కారణంగా నల్లరేగడి భూముల్లోని పంటలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.