ఎదులాపురం, మార్చి 27 : రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభం కావడం బీఆర్ఎస్ చేపట్టిన నిరసనల ఫలితమని మాజీమంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన ఆదిలాబాద్ జిల్లా తాంసి బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చాయని తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన రైల్వే అండర్ బ్రిడ్జి పనులను మాజీమంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకొని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి మాట్లాడుతూ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హామీలు ఇచ్చి తర్వాత రైల్వే పనులను నిర్లక్ష్యం చేయడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఈ నెల 23న ప్రజల తరఫున పెద్ద ఎత్తున నిరసన చేపట్టగా, దాని ఫలితంగా శ్రీరామనవమి రోజున పనులు ప్రారంభం కావడం శుభపరిణామని పేర్కొన్నారు. పనుల్లో జాప్యం సహించబోమని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ, మెట్టు ప్రహ్లాద్, యాసం నర్సింగరావు, అశోక్ స్వామి, దమ్మపాల్, నల్ల మహేందర్, కుమ్ర రాజు పాల్గొన్నారు.