తాంసి, జూన్ 27 : విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని ఎంఈవో శ్రీకాంత్ అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ఫైనాన్షియల్ లిటరసీ అనే అంశంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో భీంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మడావి జగదీశ్, సాయితేజ్, ద్వితీయ స్థానంలో కప్పర్లలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు మనీషా, హర్షిత, తృతీయ స్థానంలో గోట్కూరిలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు నవనీత్, వంశీ విజేతలుగా నిలిచారు. ఎంఈవో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రూ.5 వేలు, రెండో బహుమతి రూ.3 వేలు, మూడో బహుమతి రూ.2 వేలు విద్యార్థుల ఖాతాలో జమ చేస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రవి యాదవ్, క్విజ్ మాస్టర్ నెమలికొండ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బోథ్, జూన్ 27: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆర్బీఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్ ఇండియా క్విజ్ ఆన్ ఫైనాన్షియల్ లిటరసీ అనే అంశంపై మండల స్థాయి పోటీలు నిర్వహించారు. 11 ఉన్నత పాఠశాలలకు చెందిన 22 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఆర్బీఐ తరఫున బోథ్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ప్రహ్లాద్ నోడల్ అధికారిగా వ్యవహరించారు. బోథ్‌లోని ఆదర్శ పాఠశాల ప్రథమ, కన్గుట్ట ఉన్నత పాఠశాల ద్వితీయ, పొచ్చెర ఉన్నత పాఠశాల తృతీయ స్థానంలో నిలవగా విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థుల ఖాతాల్లో రూ 5 వేలు, రూ 4 వేలు, రూ 3 వేలు పారితోషకం కింద జమవుతాయని నోడల్ అధికారి తెలిపారు. కార్యక్రమంలో బోథ్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం పిల్లి కిషన్, ఇన్విజిలేటర్ అప్పాల శ్రీనివాస్‌రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉమేశ్‌రావు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.
సబ్ డివిజన్ పోటీల్లో ..
గుడిహత్నూర్, జూన్ 27 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (బాలికలు) సబ్ డివిజన్ స్థాయిలో నిర్వహించిన ఆల్ ఇండియా క్విజ్ ఆన్ ఫైనాన్షియల్ లిటరసీ పోటీల్లో గుడిహత్నూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ద్వితీయ బహుమతి సాధించారు. పదో తరగతి చదువుతున్న పల్సె నందిని, పవార్ దివ్య పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చి రూ.4000 నగదు అందజేశారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు శ్రీపాద శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు.
తలమడుగు, జూన్ 27 : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్బీఐ ఆధ్వర్యంలో మహారాష్ట్ర బ్యాంకు సిబ్బంది విద్యార్థులకు ఆల్ ఇండియా క్విజ్ ఆన్ ఫైనాన్షియల్ లిటరసీ అనే అంశంపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కజ్జర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలో నిలవగా రూ.5 వేలు, రెండో స్థానంలో కుచులాపూర్ విద్యార్థులకు రూ.4 వేలు, మూడో స్థానంలో నిలిచిన దేవాపూర్ విద్యార్థులకు రూ.3 వేల నగదుతో పాటు ప్రశంసాపత్రాలను మండల విద్యాశాఖాధికారి నారాయణ అందజేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పురాల రవీందర్, ప్రధానోపాధ్యాయుడు వినోద్ రెడ్డి, ఉపాధ్యాయులు నవీన్ యాదవ్, గోవర్ధన్ పాల్గొన్నారు.