ఎదులాపురం, ఫిబ్రవరి 26 : జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశామని ఆదిలాబాద్ డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో శనివారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆదివారం నిర్వహించే పల్స్‌పోలి యో కార్యక్రమానికి సంబంధించి వివరాలు వెల్లడించారు. చిన్నారులు పోలియో వ్యాధి బారిన పడకుండా చుక్కల మందు ఒక్కటే మార్గమన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించాలని సూచించారు. జిల్లాలోని 18 మండలాల్లో ఐదేండ్లలోపు పిల్లలు 78,260 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో మొత్తం 730 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. బూత్‌కు(కేంద్రం) నలుగురు చొప్పున సిబ్బందిని చుక్కలు వేయడానికి నియమించినట్లు చెప్పారు. ఉదయం 8 నుంచి సా యంత్రం 5 గంటల వరకు నిరంతరంగా చిన్నారులకు చుక్కలు వేస్తారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వ క మ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖాన, జిల్లా దవాఖానలోనూ పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి సోమ, మం గళవారాల్లో చిన్నారులకు ఇండ్లవద్దే చుక్కల మందు వేస్తారని చెప్పారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 730 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇటుక బట్టి, కాలువ పనులు జరుగుతున్న చోట, ఇతర సంచార జాతుల పిల్లలకు చుక్కల మందు వేసేందు కు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో 27 ట్రాన్సిస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హైదరాబాద్ నుంచి జిల్లా పర్యవేక్షణ అధికారిగా స్వామి వ్యవహరించనున్నట్లు తెలిపారు. ముందుగా జిల్లా కార్యాలయం నుంచి ఆశ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మెట్పెల్లివార్ శ్రీకాంత్, కార్యాలయ సిబ్బంది వెంకట్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్ సోహైల్, తెలంగాణ ప్రజారోగ్య, వైద్యఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ, యూపీహెచ్సీల సీవోలు నవీన్ కుమార్, ప్రశాంత్ దేశ్‌పాండే, రాజారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని హమాలీవాడ ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న ఉదయం చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతో పాటు కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ రానున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చిన్నారులందరికీ సిబ్బంది పోలియో చుక్కలు వేయనున్నారు.
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 26 : జాతీయ పల్స్ పోలియో టీకాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో పల్స్‌పోలియోను విజయవంతం చేయాలని కోరుతూ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీని శనివారం జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వరకు కొనసాగింది. ‘పోలియో చుక్కలు వేద్దాం.. పోలియోను సమూలంగా నిర్మూలిద్దాం’ అని నినాదాలు చేశారు. ఐదేండ్లల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఇందుకోసం అన్ని గ్రామ పంచాయతీల్లో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డాక్టర్ శ్రీనివాస్, మాస్ మీడియా అధికారి రవీందర్, సిబ్బంది నిర్మల, డాక్టర్ రాజేందర్ పాల్గొన్నారు.