నిర్మల్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : ఉక్రెయిన్‌లోని కీవ్ యూనివర్సీటీలో ఎంఎస్ చదువుకుంటున్న నిర్మల్‌కు చెందిన మునిపెల్లి సాయికృష్ణ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడులకు దిగాయన్న సమాచారాన్ని టీవీలా ద్వారా తెలుసుకున్న సాయికృష్ణ తల్లిదండ్రులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు టెన్షన్‌కు గురవుతున్నారు. గురువారం సాయంత్రం వరకు కీవ్ నగరానికి దూరంగా బాంబు దాడులు కొనసాగగా శుక్రవారం ఉదయం ఈ దాడులు నగరాన్ని చుట్టుముట్టాయి. రష్యా బలగాలు కీవ్ నగరం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు. సాయికృష్ణ ప్రస్తుతం యూనివర్సిటీని వీడి ముగ్గురు సహ విద్యార్థులతో కలిసి ఓ అపార్టుమెంటులో తలదాచుకున్నారు. సాయికృష్ణ తల్లిదండ్రులు ఘనప్రసాద్, వనజ ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆహారం రెండు రోజులకు మాత్రమే సరిపోతుందని సాయికృష్ణ ఫోన్ ద్వారా తెలిపినటు తల్లిదండ్రులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులంతా టీవీలకే అతుక్కు యుద్ధ దృశ్యాలను చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు ప్రకటించడంతో సాయికృష్ణ తల్లిదండ్రులు కొంత ఊరట చెందారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం సాయికృష్ణ తండ్రి ఘనప్రసాద్తో శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. సాయికృష్టను రప్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, తాను కూడా ఎంబసీ అధికారులతో మాట్లాడుతానంటూ హామీ ఇచ్చారు.
భీంపూర్, ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్ , ఫిబ్రవరి 25: ఆదిలాబాద్ న్యూహౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన పోలిపెల్లి గజానన్ జర్నలిస్ట్, భార్య శారద రిమ్స్‌లో ఉద్యోగి. వీరికి వంశీకృష్ణ , యశ్వసి అనే ఇద్దరు పిల్లలున్నారు. యశస్వి వరంగల్‌లో ఎంబీఏ చదువుతున్నది. వంశీకృష్ణ ఉక్రెయిన్‌లో జఫ్రోజి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 4వ సంవత్సరం వైద్య విద్యార్థి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో వీరు భయాందోళన చెందుతున్నారు. వంశీకృష్ణ శుక్రవారం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి తెలంగాణ విద్యార్థులందరినీ తీసుకురావాలని తల్లిదండ్రులు కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా రప్పిస్తారని నమ్మకం ఉందన్నారు.
యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో వైద్యవిద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. ఆదిలాబాద్ పట్టణం రాంగనర్‌లో ఉంటున్న ఎడమ నారాయణరెడ్డి -హరిత దంపతులు కూతురు నేత్రారెడ్డి జనవరి 24న ఉక్రెయిన్ వెళ్లింది. అక్కడ జఫ్రోజీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో వైద్యవిద్య మొదటి సంవత్సరంలో చేరింది. కుమారుడు అస్సాంలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కూతురు వెళ్లి నెల గడవకముందే ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో క్షణమొక యుగంలా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంజేశారు. తమ కూతురు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి భారత విద్యార్థులందరినీ స్వస్థలాలకు చేర్చాలని కోరుతున్నారు .