మంచిర్యాల, మార్చి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం భారత్‌లో గ్యాస్ మంటలు పుట్టిస్తున్నది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ రాకపోవడంతో ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రమైంది. ‘ఇబ్బంది ఏం లేదు.. సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. బుక్ చేసుకొంటే ఇంటికే తెచ్చిస్తారని’ అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు తగ్గట్టుగా కనిపించడం లేదు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మహారాష్ట్ర గ్యాస్ ఏజెన్సీలున్న ప్రాంతాల్లో సమస్య ఎక్కువైంది. ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు క్యూలు కట్టడం, గ్యాస్ కోసం పాదరక్షల వరుసలు పెట్టి ఎదురుచూడడం.. బుక్ చేసుకొన్న మూడు, నాలుగు రోజులకు కూడా గ్యాస్ సిలిండర్ డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు.
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లపై విధించిన ఆంక్షలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ నిలిపివేశారు. హాస్టళ్లు, విద్యాసంస్థలకే కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. దీంతో హోటళ్ల నిర్వాహకులు, టిఫిన్, స్నాక్స్ సెంటర్ల నిర్వహకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్‌కు బదులు కట్టెల పొయ్యి పెట్టి వంటలు చేస్తున్నారు. గతంలో చేసిన దానిలో సగం కూడా వండడం వీలుకావడం లేదని, మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్లు మూసివేసుకోవడం తప్ప, వంటలు చేయలేమంటూ వాపోతున్నారు. గృహావసరాలకు వినియోగించే సిలిండర్లపైనా సర్కారు ఆంక్షలు విధించింది.
మొన్నటి వరకు నెలకు ఒకటి చొప్పున 12 సిలిండర్లు ఎప్పుడైనా బుక్ చేసుకొనే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఒక కనెక్షన్ ఉన్న వాళ్లు 21 రోజుల తర్వాత, రెండు కనెక్షన్లు ఉన్నవారు 25 రోజుల తరువాత బుక్ చేసుకోవాలని నిబంధన పెట్టారు. దీంతో గ్యాస్ బుక్ చేసుకోవాలంటే మూడు నుంచి నాలుగు వారాలు ఎదురుచూడక తప్పనిసరి పరిస్థితి. అన్ని రోజులు ఆగి బుక్ చేసుకున్నా గ్యాస్ రావడానికి వారం రోజుల సమయం ఉంటుంది. అంటే ఎలా చూసుకున్నా గ్యాస్ కోసం నెల రోజులు ఆగాల్సిన దుస్థితి నెలకొన్నది. మరోవైపు గ్యాస్ ధరల పెరుగుదల, గ్యాస్ కొరత ఎక్కువవుతున్నట్లు వస్తున్న వార్తలతో జనం ఆందోళన చెందుతున్నారు.
గ్యాస్ కొరత నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నది. గృహావసరాలకు వాడే 14.02 కిలోల సిలిండర్ రూ.60 పెరిగి రూ.987కు చేరింది. కమర్షియల్ 19 కిలోల సిలిండర్ రూ.115 పెరిగి రూ.2,200 చేరుకున్నది. అంత ధర పెట్టినా సిలిండర్ దొరుకుతుందన్న గ్యా రెంటీ లేకపోవడం వ్యాపారవర్గాలను మరింత నీరుగారుస్తున్న ది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకు లు గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.
గ్యాస్ సిలిండర్లను బ్లాక్ చేసి అక్రమ మార్గాల్లో అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్నా డోర్ లాక్ కింద క్యా న్సల్ కొడుతున్నారు. దీంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యి వాడకం పెరిగింది. పెద్దపెద్ద హోటళ్ల నిర్వాహకులు కట్టెలు వాడుతున్నారు. మొన్న టి వరకు రూ.400 క్వింటాళ్ల చొప్పున విక్రయించిన కట్టెలు.. ప్రస్తుతం రూ.800 క్వింటాలకు అమ్ముతున్నారని వాపోతున్నా రు. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ బిజినెన్ చేయలేమని చెప్తున్నా రు. కమర్షియల్ సిలిండర్లపై ఆంక్షల నేపథ్యంలో గృహావసరాలకు వినియోగించే సిలిండర్లు అయినా సరఫరా చేయాలని వ్యా పారులు కోరుకుంటున్నారు. ఎల్పీజీ కొరత పెరిగిన నేపథ్యం లో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారం జరుగుతున్నది.
వాహనదారుల అవసరాలకు తగినట్లుగా పెట్రోలియం నిల్వలు లేవని, రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ కొర త రావచ్చని చెప్తున్నారు. వాహనాల్లో వినియోగించే సీఎన్జీ గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధర లు పెరగోచ్చని చెప్తున్నారు. అదే జరిగితే రానున్న రోజుల్లో ఇ బ్బందులు తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నది. గ్యాస్ కొరత ఉన్నప్పటికీ ఇబ్బందికరమైన పరిస్థితులైతే లేవని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. కృత్రిమ కొరతకు అవకాశమే లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నా రు. కాగా.. మంచిర్యాల జిల్లాలో ఎల్పీజీ గృహావసర కనెక్షన్లు 2,59,850 ఉండగా.. కమర్షియల్ కనెక్షన్లు 1,475 ఉన్నాయి.
హోటళ్లకు కావాల్సిన కమర్షియల్ సిలిండర్లు ఇవ్వడం లేదు. రీ ఫిల్లింగ్ ఆగిపోయిందని చెప్తున్నారు. ఒక్క సిలిండర్ పెట్టి నడిపిస్తున్నాం. టిఫిన్స్, చాయ్ బంద్ చేసి, మీల్స్ అందిస్తున్నాం. దీంతో వ్యాపారం సగానికిపైగా పడిపోయింది. కట్టెల పొయ్యి వాడితే అదనపు భారం పడుతుంది. అదనపు ఖర్చుతోపాటు, సమయం వృథా అవుతున్నది. హోటళ్లలో పని చేసే వారి జీవనోపాధి మీద ప్రభావం చూపుతున్నది. పెద్ద హోటళ్లు కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. గతంలో ప్రతిది గ్యాస్‌పై చేసిన వాళ్లం. ఇప్పుడు కట్టెల పొయ్యిపై చేస్తున్నాం. ఎంత చేసినా ఫలితం ఉండడం లేదు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై దృష్టి సారించాలి.
– దామోదర్, ప్రైవేటు హోటల్ నిర్వాహకుడు