తెలంగాణలో 2023 ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారు. అది ప్రజాస్వామ్య తీర్పు. ఆ తీర్పును గౌరవించాలి. కానీ ఆ ఎన్నికల తీర్పును ఒక నాయకుడి మొత్తం రాజకీయ జీవితానికి తుది తీర్పుగా భావించడం మాత్రం ఘోరం! ఎన్నికలో ఓటమి ఒక రాజకీయ ఘటన. చరిత్రలో స్థానం అనేది ఎవరూ చేరుపలేని శాశ్వత సంఘటన! భారత రాజకీయ చరిత్రను ఒక్కసారి చూస్తే ఇది స్పష్టమవుతుంది. జవహర్లాల్ నెహ్రూ సుదీర్ఘకాలం దేశాన్ని నడిపించినప్పటికీ ఆయన రాజకీయ వారసత్వంపై ఇప్పటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందిరాగాంధీ 1977లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయినా మూడేండ్లలోనే తిరిగి అధికారంలోకి వచ్చారు. ఎన్.టి.రామారావు కూడా రాజకీయ జీవితంలో ఓటమిని చూశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా అధికారానికి బయట ఉన్న కాలాలను చూశారు. అంటే రాజకీయాల్లో గెలుపోటములు శాశ్వతం కాదు. కానీ ఒక నాయకుడి వ్యక్తిత్వం, ప్రజలతో అనుబంధం, చరిత్రలో పాత్ర శాశ్వతమైనవి!!
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పోషించిన పాత్రను చరిత్ర నుంచి వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను దీర్ఘకాలం రాజకీయ ఎజెండాలో సజీవంగా ఉంచడం, వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టడం, కేంద్ర రాజకీయాల్లో తెలంగాణ అంశాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్లడం కీలక అధ్యాయాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లు ముఖ్యమంత్రిగా సాగించిన పాలనలో అనేక విజయాలు ఉన్నాయి. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం జనం గుండెల్లోనే ఉన్నది.
కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆయన ఆస్తులు, భూములు, పాలనను రాజకీయ చర్చలోకి తీసుకువస్తున్నారు. అధికారం చేతుల్లో ఉన్నవాళ్లు విచారణ చేసుకోవచ్చు. అది ప్రజాస్వామ్య ధర్మం. కానీ ఒక ప్రశ్న మాత్రం మనల్ని వేధిస్తున్నది. ఇంతగా విమర్శిస్తున్నప్పటికీ కేసీఆర్ పేరును జనం తల్చుకుంటూనే ఉన్నారు. నిన్నామొన్న గణేశ్ నిమజ్జనం వేళ ట్యాంక్‌బండ్ మీద వినిపించిన పాటలు దీనికి ఒక ఆసక్తికరమైన సమాధానాన్ని చూపించాయి.
ట్యాంక్‌బండ్‌పై డప్పుల మోత.. యువత కేరింతలు. లారీల మీద భారీ స్పీకర్లు. అలాంటి సమయంలో ఒక్కసారిగా వినిపించిన స్వరం-మళ్లీ మళ్లీ మోగిన గులాబీల గీతం దేనికి సంకేతం? సారే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల.. మళ్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా అంటూ జనం ఎందుకు తల్చుకుంటున్నరు? చల్ దేఖ్లేంగే వంటి పాటలు ఎందుకు ప్రతిధ్వనిస్తున్నయి? అది రాజకీయ సభ కాదు, ఎన్నికల ప్రచారం అసలే కాదు.. గణేశ్ నిమజ్జన వేడుకలు. అలాంటి ఉత్సవ ఊరేగింపుల్లో డీజేలు, స్పీకర్ల శబ్దంపై పోలీసులు ఆంక్షలు అమలు చేసినా యువత ఉత్సాహాన్ని, కేసీఆర్ పట్ల అభిమానాన్ని ఆపలేకపోయారు. ఒక స్పీకర్‌ను ఆపవచ్చు. ఒక పాటను ఆపవచ్చు. ఒక డీజేను నిలిపివేయవచ్చు. కానీ ప్రజల జ్ఞాపకాన్ని ఎవరు ఆపగలరు? ట్యాంక్‌బండ్ నుంచి పల్లెల్లో పెండ్లిళ్లు, జాతరలు, సంబరాల వరకు కేసీఆర్, గులాబీ ఉద్యమంతో ముడిపడిన పాటలు వినిపిస్తున్నయి. కేసీఆర్ పాట ప్రజా సంస్కృతిలోకి ప్రవేశించిన అద్భుత దృశ్యాలవి.
ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ తెర మీద శంకరన్న. ప్రేక్షకుల జ్ఞాపకంలో కేసీఆర్. ‘ది ప్యారడైజ్’ సినిమా మరో ఆసక్తికరమైన దృశ్యాన్ని మన ముందుంచింది. ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్రలో తెలంగాణ యాస, శరీరభాష, రాజకీయ శైలి, డైలాగ్ డెలివరీ ఇవన్నీ కేసీఆర్‌ను గుర్తు చేస్తున్నాయని ప్రేక్షకులు, సమీక్షకులు వ్యాఖ్యానించారు. తెరపై కనిపించింది శంకరన్న. కానీ ప్రేక్షకుల జ్ఞాపకంలో మెదిలింది కేసీఆర్. ఇదే కళకు ఉన్న విచిత్రమైన శక్తి. పేరు చెప్పకుండా ఒక వ్యక్తిత్వాన్ని గుర్తు చేయడం గొప్ప విషయం. ఇక్కడ కేసీఆర్ ఒక వ్యక్తి కంటే పెద్ద రాజకీయ ప్రతీకగా కనిపిస్తారు. కేసీఆర్‌ను ఓడించవచ్చు. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయారు. అధికారం కోల్పోయారు. ప్రతిపక్షంలో కూర్చున్నారు. కానీ తెలంగాణ రాజకీయ చరిత్రలోని స్థానం కూడా పోయిందని అనడం అసంబద్ధం. ప్రతి అంశానికి కేంద్రంగా చేస్తూ, కేసీఆర్‌పై నిరంతరం రాజకీయ దాడులు చేస్తూ ఉంటే ఒక ప్రశ్న మాత్రం సహజంగానే వస్తుంది. అదే ఎవరు ఎవరిని రాజకీయంగా కేంద్రంగా చేస్తున్నారు? అని.
ప్రజల మనసులో చోటు సంపాదించుకున్న కేసీఆర్‌ను తెలంగాణతో సమానంగా చూస్తారు ప్రజలు. అందుకే ఉద్యమంలో, అధికారంలో ఆయన పేరు వినిపించింది. ప్రతిపక్షంలో ఉన్నా వినిపిస్తున్నది. ట్యాంక్‌బండ్‌పై పాటగానూ వినిపిస్తున్నది. ప్రజలు తమ జ్ఞాపకాలను తాము కాపాడుకుంటారు. అందుకే కేసీఆర్ గురించి తీర్పు కాంగ్రెస్ నేతలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలే ఇస్తారు. కానీ ఈరోజు కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం ఒక ప్రశ్నను మన ముందుంచుతున్నాయి..
అధికారం కోల్పోయిన నాయకుడి పేరు ఎందుకు ఇంకా మారుమోగుతున్నది? సమాధానం ఒక్కటే కావాల్సిన అవసరం లేదు. అది అభిమానమై ఉండొచ్చు. అది జ్ఞాపకమై ఉండొచ్చు. అది ఉద్యమ వారసత్వమై ఉండొచ్చు. అది పాలనపై నోస్టాల్జియా అయి ఉండొచ్చు. ఇవన్నీ కలిసిన ప్రజల అనుభూతి కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. ‘ఎక్కడ ఉన్నా పులి పులేరా డోంగ్రే!’ అనే ఎస్వీ రంగారావు డైలాగ్ గుర్తుకు వస్తున్నది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కేసీఆర్ అనే రాజకీయ అధ్యాయం తెలంగాణ చరిత్రలో తన ముద్ర వేసుకున్నది. ఆ ముద్రను ఎవరు ఎంతగా చెరిపివేయాలని యత్నించినా అది వికటిస్తుంది. ఎందుకంటే.. కేసీఆర్ చరిత్ర శాశ్వతం!
వీరేంద్ర కాపర్తి