హైదరాబాద్, సెప్టెంబర్26 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకులాల్లో పూర్తిస్థాయి సిబ్బంది లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ అధికారులను నిలదీశారు. తక్షణం రెగ్యులర్ సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ వెల్ఫేర్పై ఏర్పాటు చేసిన అసెంబ్లీ కమిటీ సమావేశం చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూర్ నేతృత్వంలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఒక్కో అంశం వారీగా సమీక్షించారు. బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులను అడిగి ఆయా పథకాలు, చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ ప్రధానంగా గురుకులాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. గురుకులాల్లో రెగ్యులర్ టీచింగ్ పోస్టులు భారీగా ఖాళీ ఉన్నాయని, ఈ నేపథ్యంలో వాటిని సత్వరం భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయని, ఈ నేపథ్యంలో డైట్ చార్జీలను ఆ మేరకు మరోసారి పెంచాలని, ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపాలని అధికారులకు సూచించారు. అనంతరం చైర్మన్ మక్కాన్సింగ్ మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. అనేక గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. సింగరేణి ఏరియాలో 11 నియోజకవర్గాలు ఉన్నాయని, ఆయా చోట్ల అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కోట్లాది రూపాయలను అద్దెలకు చెల్లించకుండా, సింగరేణి, ఎన్టీపీసీ పరిధిలోని భవనాల్లోకి గురుకులాలను మార్చాలని, వసతులను సమకూర్చుకోవాలని సూచించారు.